
పాట ప్రారంభంలోనే... "అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట... అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట"... అనే పంక్తులతో తల్లి ప్రేమకు ఎంతటి విలువ ఉందో ఎంతో అందంగా చెప్పారు. చిన్నారి జీవితంలో మొదట వినిపించే స్వరం తల్లి జోలపాటే. ఆ పాటలో ప్రేమ ఉంటుంది, భరోసా ఉంటుంది, భవిష్యత్తుకు ఆశీర్వాదం ఉంటుంది. "నిండు జాబిలి చూపించి... గోటితో బుగ్గను గిల్లేసి... ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన" అనే పంక్తులు ప్రతి ఒక్కరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. తల్లి ఇచ్చే ప్రతి స్పర్శలో ప్రేమ, ప్రతి చూపులో ఆశీర్వాదం దాగి ఉంటాయని ఈ పల్లవి చెబుతోంది. మొదటి చరణంలో తల్లిని ప్రకృతితో పోల్చిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. "కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ... మొలిచే పచ్చని పైరులకి నేలతల్లి అమ్మ" అనే పంక్తులు తల్లి గొప్పతనాన్ని ప్రకృతి ద్వారా వివరిస్తాయి. వానకు ఆకాశం ఎంత అవసరమో, పంటకు నేల ఎంత ముఖ్యమో, చల్లని గాలికి పూలకొమ్మ ఎంత అందమో, అలాగే ప్రతి జీవికి తల్లి అంతే అవసరం అని రచయిత చెబుతున్నారు. "ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ" అనే భావం తల్లి స్వరాన్ని కోయిల గానంతో పోల్చుతుంది. చివరగా "సృష్టికి మూలం అమ్మతనం... సృష్టించలేనిది అమ్మ గుణం" అనే పంక్తులు తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం లేదని, అది సృష్టిలోనే అత్యంత గొప్ప వరం అని తెలియజేస్తాయి. రెండో చరణంలో తల్లి జీవితంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో అద్భుతమైన ఉపమానాలతో వివరించారు."నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ..."అనే పంక్తి ప్రతి గొప్ప విజయానికి వెనుక తల్లి ప్రోత్సాహం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. "అందంపొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ" అనే లైన్ శిల్పం అందంగా మారడానికి శిలపై పడే ప్రతి ఉలి దెబ్బ ఎంత అవసరమో, పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి తల్లి పడే కష్టం కూడా అంతే విలువైనదని