
విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థలలో కొలువులు సాధించాలి, హెచ్-1బి వీసా సంపాదించి, ఆ తరువాత గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి.. చివరకు అక్కడే స్థిరపడాలనేది గత కొన్ని దశాబ్దాలుగా సగటు ఇండియన్ టెక్ నిపుణుడి స్వప్నంగా ఉంటూ వస్తోంది. సమాజంలో అత్యున్నత ఆర్థిక, సామాజిక హోదాకు ప్రతీకగా నిలిచిన ఈ అమెరికన్ డ్రీమ్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వలస విధానాలలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తలెత్తుతున్న ఒడిదుడుకులు, అమెరికా అంతటా విస్తరిస్తున్న కొత్త రాజకీయ సమీకరణాల కారణంగా.. దశాబ్దాల నాటి ఈ ఆకాంక్షాత్మక ప్రయాణం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులు, స్థానిక శ్రామిక మార్కెట్లలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలు విడివిడి సంఘటనలుగా కాకుండా, ప్రపంచ శ్రామిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్న ఒక పెద్ద వ్యవస్థాగత సంక్షోభంలో భాగంగా మారుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన ఐటీ ఉద్యోగుల పట్ల.. ముఖ్యంగా తాత్కాలిక హెచ్-1బి వీసాలపై ఆధారపడి జీవిస్తున్న వారి పట్ల ఇటీవలి కాలంలో స్థానిక సమాజంలో శత్రుత్వ భావాలు, వలస వ్యతిరేక ధోరణులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ వంటి కీలకమైన రంగాలలో విదేశీ నిపుణులు రావడం వల్లే స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు హరించుకుపోతున్నాయనే తప్పుడు ప్రచారం ఊపందుకుంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు తక్కువ వేతనాలకే లభించే విదేశీ వలసదారులకు ప్రాధాన్యత ఇస్తూ, తమ సొంత పౌరులను పక్కన పెడుతున్నాయనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వ్యక్తమవుతున్నాయి. ప్రచారమౌతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, అమెజాన్ వంటి సాంకేతిక సామ్రాజ్యాలను అగ్రస్థానంలో నిలబెట్టడంలోను, అత్యున్నత కార్యనిర్వాహక పదవులను అధిరోహించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంలోను ఇండియన్స్ పోషించిన పాత్రను పూర్తిగా విస్మరించి, వారిని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే