
కౌటాల మండల సమావేశంలో అధికారులను నిలదీస్తున్న సర్పంచి భర్త కౌటాల, న్యూస్‌టుడే: కొంత మంది మహిళా సర్పంచుల భర్తలు, కుమారులు గ్రామపంచాయతీ పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. పంచాయతీ సమావేశాలే కాకుండా మండలస్థాయిలో నిర్వహించే సమావేశాల్లోనూ వారే ముందుండి అన్నీ తామై వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కౌటాల మండలకేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మహిళా సర్పంచులు హాజరైనప్పటికీ.. వారి భర్తలు పాల్గొని పలు సమస్యలపై అధికారులను నిలదీయడం గమనార్హం. ఈ విషయంలో పలువురు అధికారులు కల్పించుకొని పదవిలో లేనివారు సమావేశంలో పాల్గొనవద్దని చెప్పడంతో.. వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ దండె విఠల్ కల్పించుకొని సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సిర్పూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో మహిళా సర్పంచులే ఎన్నికయ్యారు. కొంత మంది మహిళలు కాస్త చొరవ తీసుకొని పాలనా వ్యవహారాలు నడుపుతున్నప్పటికీ.. కొన్నిచోట్ల మాత్రం భర్తలు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గ్రామసభ, మండల సభ అధికారిక కార్యక్రమాల్లో వాస్తవ సభ్యులకు మినహా ఇతరులకు మాట్లాడే అవకాశం లేదు. కాని వీరు మాత్రం అధికారుల పనితీరుపై బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. అంతేకాకుండా పలు పంచాయతీల్లో పాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకొని పంచాయతీ నిధులను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటుండటం గమనార్హం. ఈ వ్యవహారం అంతా పంచాయతీ కార్యదర్శులు, ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ.. వారితో ఎందుకొచ్చిన వివాదం అంటూ సర్దుకుపోతున్నారనే వాదన వినిపిస్తోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు