
చామరాజనగర, న్యూస్‌టుడే: అటవీ అధికారుల కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకా పరిధిలోని హాలెడట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం చోటుచేసుకొంది. మృతులను హనూరు తాలూకా తోమియర్పాళ్య గ్రామానికి చెందిన ఆంథోణి స్వామి, పీటర్, కుమార్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మహిమ దాస్‌ను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ‘కావేరి వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు వచ్చారనే సమాచారంతో గాలించడానికి వెళ్లాం. కాసేపటికి జంతు మాంసాన్ని తీసుకొస్తున్న నలుగురు వ్యక్తులను గమనించాం. లొంగిపోవాలని సూచించగా మాపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో వారు మరణించారు’ అని అటవీశాఖ అధికారులు తెలిపారు. తమ గ్రామానికి చెందిన ముగ్గురు మరణించారని తెలియడంతో వారి బంధువులు, గ్రామస్థులు సాగ్య గ్రామంలోని అటవీశాఖ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడి వస్తువులు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఎదురుకాల్పుల్లో మరణించినట్లు సిబ్బంది అబద్ధం చెబుతున్నారని, ఎన్‌కౌంటర్ చేశారని వారు ఆరోపించారు. పశువులు అడవిలోకి వెళ్లి రాకపోవడంతో గాలించడానికి మాత్రమే వెళ్లారన్నారు. ఒకవేళ వేటకే వెళ్తే వారి కాళ్లపైకి కాల్పులు జరపకుండా ఛాతీ, గొంతుపై ఎందుకు కాల్చారని ప్రశ్నించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆసుపత్రి ఉన్నా, మృతదేహాలను మైసూరుకు ఎందుకు తరలించారో అధికారులు బదులివ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు మరణించిన వారు వేటగాళ్లు కాదని గుర్తించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పుట్టరంగ శెట్టి అన్నారు. ఈ ఘటనపై మెజిస్ట్రేట్తో దర్యాప్తు చేయిస్తామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. నివేదికకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు