
ఇంటర్నెట్‌ డెస్క్‌: రూల్స్‌ లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ లేని కూడలి లాంటిదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) అన్నారు. అటువంటి పరిస్థితుల్లో గందరగోళం తప్పదని హెచ్చరించారు. దిల్లీ వేదికగా బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. సరఫరా గొలుసులను కాపాడి, సమీకృత మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు గ్లోబల్ సౌత్‌ దేశాలతో తనకున్న సన్నిహిత సంబంధాలను బ్రిక్స్‌ ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, తయారీ రంగం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు.
జెలెన్‌స్కీతో పుతిన్‌ చర్చలు అసాధ్యం: క్రెమ్లిన్‌
బలవంతుడిదే రాజ్యమనే భావనను వీడాలని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ ఐక్యతకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాలని బ్రిక్స్‌ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. పరిమాణం, శక్తిసామర్థ్యాలు, సంపదతో సంబంధం లేకుండా ప్రపంచ వేదికపై అన్ని దేశాలు సమానమేనని, అంతర్జాతీయ నియమాలను అవన్నీ కలిసి రూపొందించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలు అందరికీ వర్తించేలా గ్లోబల్ సౌత్ దేశాలు కృషి చేయాలని చెప్పారు. ప్రపంచ వ్యవహారాల్లో ఐరాస అధికారాన్ని, పాత్రను సమర్థించాలని, అన్ని దేశాలకూ సమాన భాగస్వామ్యం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
