
మన పొట్ట లోపలి భాగాల్ని, అంతర్గత అవయవాల్ని కప్పి ఉంచే ఒక సన్నని పొరను "పెరిటోనియం" (Peritoneum) అంటారు. ఈ పొరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి తీవ్రమైన వాపు/మంట (Inflammation) కలగడాన్ని పెరిటోనిటిస్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొట్టలోని ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో మార్పులు జరిగి "సెప్సిస్" (Sepsis) అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీయొచ్చు. పెరిటోనియం రావడానికి కారణాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసరంగా ఎప్పుడు డాక్టర్ని కలవాలి అన్న పూర్తి వివరాల్ని డాక్టర్ అనుపమ ఎన్.కె, (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు.) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.పెరిటోనిటిస్ ప్రధాన లక్షణాలు తీవ్రమైన కడుపు నొప్పి: మొదట స్వల్పంగా మొదలై, హఠాత్తుగా తీవ్రమై తగ్గకుండా ఉండే నొప్పి. నొప్పి తీవ్రతకు కూర్చోవడం కూడా కష్టమవుతుంది. కడుపు ఉబ్బరం, గట్టిపడటం: కడుపు వాచిపోయి, బిగుతుగా మారి, తాకితే తీవ్రమైన నొప్పి రావడం (Tenderness). మలబద్ధకం లేదా పేగుల స్తబ్దత (Paralytic ileus): పేగుల కదలికలు తాత్కాలికంగా ఆగిపోవడం. డీహైడ్రేషన్ లక్షణాలు: నాలుక, పెదాలు ఎండిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం. వాపు , విపరీతమైన అలసట. వేగవంతమైన గుండె స్పందన (Fast heart rate). తీవ్రమైన జ్వరం, చలి.ప్రధాన కారణాలు (Causes) పెరిటోనిటిస్ ప్రధానంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల లేదా అంతర్గత రసాయన ద్రవాలు లీక్ అవ్వడం వల్ల వస్తుంది.సెకండరీ ఇన్ఫెక్షన్లు (Secondary Infections - చాలా సాధారణం) పొట్టలోని ఇతర అవయవాలు దెబ్బతిని, వాటిలోని ఇన్ఫెక్షన్ పెరిటోనియం పొరకు పాకినప్పుడు ఇది వస్తుంది. అపెండిసైటిస్ పగిలిపోవడం పేగుల్లో రంధ్రాలు పడటం (డైవర్టికులైటిస్ లేదా IBD వల్ల). కడుపులో అల్సర్లు ముదిరి కడుపు గోడకు రంధ్రం పడటం గర్భాశయ నాళం పగలడం (Ruptured ectopic pregnancy) కడుపు శస్త్రచికిత్సల (Surgeries) వల్ల ఇన్ఫెక్షన్ రావడం లేదా ఏదైనా బలమైన గాయం తగలడం.ప్రైమరీ ఇన్ఫెక్షన్లు (Primary Infections) ఇది నేరుగా పెరిటోనియంలోనే మొదలవుతుంది. కాలేయ వ్యాధులు (Cirrhosis), గుండె వైఫల్యం లేదా క్యాన్సర్ వల్ల కడుపులో నీరు చేరినప్పుడు (Ascites) ఇన్ఫెక్షన్ రావడం. కిడ్నీ సమస్యలకు చేసే పెరిటోనియల్ డయాలసిస్ (Peritoneal Dialysis) లేదా ఫీడింగ్ ట్యూబ్ల ద్వారా బ్యాక్టీరియా లోపలికి చేరినప్పుడు.కెమికల్ పెరిటోనిటిస్ శరీరంలోని ఆమ్లాలు, ద్రవాలు బయటకు లీక్ అయి పెరిటోనియంపై పడినప్పుడు ఇన్ఫెక్షన్, వాపు వస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్లు లీక్ అవ్వడం (Pancreatitis). పిత్తాశయం నుంచి బైల్ (పిత్త రసం) లీక్ కావడం. కడుపులో నుంచి యాసిడ్ (Stomach acid) లీక్ అవ్వడం.వచ్చే సమస్యలు/ప్రమాదాలు సమయానికి చికిత్స అందకపోతే: సెప్సిస్, సెప్టిసీమియా: రక్తంలో ఇన్ఫెక్షన్ వ్యాపించి ప్రాణాపాయం కలగడం. డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత. కిడ్నీ పనితీరు దెబ్బతినడం పేగుల్లో అడ్డంకులు (Bowel Obstruction) ఏర్పడటం.రోగ నిర్ధారణ పరీక్షలు (Diagnosis) వైద్యులు కడుపును భౌతికంగా పరీక్షించడంతో పాటు కింది పరీక్షలు చేస్తారు. రక్త పరీక్షలు: ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి తెల్ల రక్త కణాల సంఖ్య (WBC) పెరుగుదలను గుర్తించడం. ఇమేజింగ్ పరీక్షలు: అల్ట్రాసౌండ్, CT స్కాన్ లేదా MRI. పారాసెంటెసిస్ (Paracentesis): కడుపులో చేరిన ద్రవాన్ని సూది ద్వారా తీసి ల్యాబ్లో పరీక్షించడం. లాపరోస్కోపీ: కెమెరా ద్వారా కడుపు లోపలి భాగాన్ని నేరుగా పరిశీలించడం.చికిత్సా విధానం తక్షణ అత్యవసర చికిత్స: శరీరం షాక్కు గురికాకుండా ఉండటానికి వెంటనే IV ఫ్లూయిడ్స్ (సెలైన్), శక్తివంతమైన బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. టార్గెటెడ్ చికిత్స: రక్త పరీక్షల్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందో గుర్తించి, దానికి తగిన ప్రత్యేక యాంటీబయాటిక్స్ ఇస్తారు. సర్జరీ (అవసరమైతే): అపెండిక్స్ లేదా పేగుల్లో రంధ్రాలు పడితే సర్జరీ చేసి వాటిని సరిచేస్తారు. కడుపు లోపలి ఇన్ఫెక్షన్ ద్రవాన్ని శుభ్రం చేస్తారు.ఎప్పుడు అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్ళాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆకస్మికంగా కడుపులో భరించలేని నొప్పి రావడం, కడుపు బండలా గట్టిపడటం, విపరీతమైన జ్వరం లేదా వాంతులు అవుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ విభాగానికి వెళ్ళాలి. పెరిటోనియల్ డయాలసిస్ చేయించుకునే రోగులు చేతుల్ని, క్యాథెటర్ ప్రాంతాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి (Hygiene). లివర్ సిర్రోసిస్ ఉన్నవారు కడుపులో నీరు చేరినప్పుడు (Ascites) వైద్యుల సలహాతో క్రమం తప్పకుండా మందులు వాడాలి. గ్యాస్ట్రిక్ అల్సర్, అపెండిసైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభంలోనే పూర్తి చికిత్స తీసుకోవాలి.సమయం తెలుగు సంప్రందించిన వైద్య నిపుణులుడాక్టర్ అనుపమ ఎన్.కె సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు.




