
సైక్లోస్పోరా ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. యూఎస్ వ్యాప్తంగా 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సైక్లోస్పోరా అనేది 'సైక్లోస్పోరా కయేటనెన్సిస్' (Cyclospora cayetanensis) అనే అతి సూక్ష్మమైన పరాన్నజీవి (Parasite). ఇది చిన్నపేగును ఆశ్రయించి సైక్లోస్పోరియాసిస్ (Cyclosporiasis) అనే వ్యాధిని కలిగిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా ఈ పరాన్నజీవి శరీరం లోపలికి చేరుతుంది. పేగుల్లో చేరాక ఇది వేగంగా పెరిగి వాపు, మంటను కలిగిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వర్షాకాలంలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది.సరైన చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల నుంచి వారాల పాటు వేధిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోలుకున్నప్పటికీ, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది కాస్త తీవ్రంగా మారవచ్చు. సైక్లోస్పోరా రావడానికి కారణాలు, ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా సోకుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పూర్తి వివరాలు గురించి డాక్టర్ అనుపమ ఎన్. కె. (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు.సైక్లోస్పోరా ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు కలుషిత ఆహారం, నీరు: కలుషితమైన నీటితో కడిగిన తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు తినడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. పారిశుధ్య లోపం: సరిగ్గా శుభ్రం చేయని నీటిని తాగడం, పరిశుభ్రత పాటించకుండా ఆహారం వండటం ప్రధాన కారణాలు. వ్యాప్తి చెందే విధానం: సరైన పారిశుధ్య వసతులు లేని ప్రాంతాల్లో ఇది ఎక్కువ. కానీ కలుషితమైన కూరగాయలు, పండ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయినప్పుడు ఎక్కడైనా వ్యాపించే అవకాశం ఉంది.ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా సోకుతుందా? లేదు సైక్లోస్పోరా ఇన్ఫెక్షన్ ఒకరితో ఒకరు తిరగడం వల్ల లేదా తాకడం వల్ల నేరుగా సోకదు.గమనిక: రోగి మలం ద్వారా ఈ పరాన్నజీవి బయటకు వచ్చాక, వాతావరణంలో (గాలి, నీరు, నేలలో) కొన్ని రోజుల నుంచి వారాల సమయం గడిపిన తర్వాత మాత్రమే ఇతరులకు సోకే శక్తిని సాధిస్తుంది. కాబట్టి రోగిని తాకడం వల్ల తక్షణమే ఇది వ్యాపించదు. అయితే పారిశుధ్యం సరిగ్గా లేకపోతే నీరు, ఆహారం కలుషితమై పరోక్షంగా సోకే ప్రమాదం ఉంది.సైక్లోస్పోరా ఇన్ఫెక్షన్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ప్రధాన లక్షణం: పదే పదే నీళ్ల విరేచనాలు (Watery Diarrhea) కావడం. ఇది కొన్ని వారాల పాటు రావడం, తగ్గడం జరుగుతుంది. ఇతర లక్షణాలు: పొత్తికడుపు పట్టుకుపోవడం/నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు, ఆకలి మందగించడం, నీరసం, తేలికపాటి జ్వరం, గ్యాస్ పెరగడం, బరువు తగ్గడం. సమయం: పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించిన దాదాపు ఒక వారం తర్వాత లక్షణాలు బయటపడతాయి.వైద్యుడిని వెంటనే ఎప్పుడు సంప్రదించాలి? కింది పరిస్థితులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. విరేచనాలు 2 నుంచి 3 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే. డీహైడ్రేషన్ లక్షణాలు: తీవ్రమైన దాహం, మైకం రావడం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గిపోవడం. నిరంతర వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, మలంలో రక్తం పడటం, ఎక్కువ జ్వరం లేదా వేగంగా బరువు తగ్గడం. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రారంభంలోనే వైద్య సాయం పొందడం మంచిది.ఇంట్లో పాటించాల్సిన నివారణ చర్యలు ఆహార పరిశుభ్రత: పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తినే ముందు లేదా వండే ముందు పారే పరిశుభ్రమైన నీటిలో బాగా కడగాలి. సురక్షిత నీరు: కాచి చల్లార్చిన నీటిని లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి. చేతుల శుభ్రత: ఆహారం తినేముందు, వండేముందు, బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కిచెన్ పరిశుభ్రత: కటింగ్ బోర్డులు, పాత్రలు, వంటగది ఉపరితలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.సైక్లోస్పోరా గురించి ముఖ్యమైన విషయాలు యాంటీబయాటిక్ చికిత్స: సాధారణ విరేచనాల మందులు ఈ పరాన్నజీవిపై పనిచేయవు. వైద్యులు మల పరీక్ష (Stool Test) చేసి 'సైక్లోస్పోరా' అని నిర్ధారించాక, నిర్దిష్టమైన యాంటీబయాటిక్స్ (సాధారణంగా Cotrimoxazole/TMP-SMX) సూచిస్తారు. క్లోరిన్ నిరోధకత: సాధారణ నీటి శుద్ధి ప్రక్రియల్లో ఉపయోగించే క్లోరిన్‌ను కూడా ఈ పరాన్నజీవి తట్టుకోగలదు. అందుకే నీటిని బాగా కాచడం (Boiling) లేదా మైక్రాన్ ఫిల్టర్లను ఉపయోగించడం సురక్షితం. వర్షాకాలంలో జాగ్రత్త: పచ్చి సలాడ్లు, బయట విక్రయించే పండ్ల రసాలు వర్షాకాలంలో తీసుకోవడం తగ్గించాలి.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ అనుపమ ఎన్. కె. సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు



