
అకస్మాత్తుగా శరీరంపై వచ్చే ఎర్రటి దద్దుర్లు, పొట్టు రాలడం, తీవ్రమైన దురద అనేవి అర్టికేరియా (Urticaria) యొక్క లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు కొన్నిసార్లు వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు, మందుల ప్రతిచర్యలు లేదా దుమ్ము అలెర్జీల కారణంగా అకస్మాత్తుగా కనిపించవచ్చు. సాధారణంగా హైవ్స్ (Hives) లేదా దద్దుర్లు అని పిలిచే అర్టికేరియా చర్మంపై ఎర్రగా, ఉబ్బినట్లుగా వచ్చి తీవ్రమైన దురదను కలిగిస్తుంది. అర్టికేరియాకి ప్రధాన కారణాలు, నివారణ మార్గాలు, ఎప్పుడు వైద్యుణ్ని సంప్రదించాలి ఇలా పూర్తి సమాచారాన్ని డాక్టర్ షిరీన్ ఫుర్టాడో (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ & కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ CMI హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అర్టికేరియా ప్రధాన కారణాలు కొన్ని రకాల ఆహారాలు, మందులు, ఇన్ఫెక్షన్లు, అధిక వేడి, మానసిక ఒత్తిడి, కీటకాలు కుట్టడం లేదా చర్మంపై ఎక్కువ ఒత్తిడి పడటం వంటివి దీనికి కారణం కావచ్చు. ఈ సమస్య సాధారణంగా తీవ్రమైన దురదతో మొదలవుతుంది. దీని తరువాత చర్మం ఎర్రబడటం, పొక్కులు వస్తాయి. చాలా మందికి చర్మంపై వాపు కూడా రావచ్చు. ఈ దద్దుర్లు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖం, మెడ, చేతులు, కాళ్లు, వీపు లేదా శరీరం మొత్తం మీద కూడా రావచ్చు.పాటించాల్సిన చిట్కాలు చర్మంపై చల్లని క్లాత్‌తో అద్దడం (Cool Compress), వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. ఘాటైన వాసన, కెమికల్స్ ఉండే సబ్బులు, పర్ఫ్యూమ్లకు దూరంగా ఉండండి. కలబంద (Aloe Vera) జెల్ లేదా క్యాలమైన్ లోషన్ రాస్తే చర్మం చల్లబడి దురద తగ్గుతుంది. ఏ ఆహారం తిన్న తర్వాత దద్దుర్లు వస్తున్నాయో ఒక నోట్‌బుక్‌లో రాసిపెట్టుకుంటే ట్రిగ్గర్లను గుర్తించడం సులువుగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోతాయి. ఇందుకోసం ఒక స్పూన్ అల్లం రసంలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తీసుకోండి. రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ముఖ్యమైన ఆహార మార్పులు, జాగ్రత్తలు అధిక హిస్టమైన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి: నిల్వ ఉంచిన ఆహారాలు (Fermented foods), ప్రాసెస్ చేసిన మాంసం, పాత చీజ్, వైన్, వెనిగర్, టమోటాలు, పచ్చళ్ల వంటి వాటిలో హిస్టమైన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించడం మంచిది. సహజ హిస్టమైన్ బ్లాకర్స్: విటమిన్-సి ఎక్కువగా ఉండే పండ్లు, క్వెర్సెటిన్ (Quercetin) లభించే ఉల్లిపాయలు, ఆపిల్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అలర్జీ తీవ్రతను తగ్గిస్తాయి. ఒత్తిడి నిర్వహణ: మానసిక ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో కార్టిసాల్, హిస్టమైన్ విడుదల పెరిగి దద్దుర్లు తీవ్రమవుతాయి. రోజూ ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మాయిశ్చరైజింగ్: స్నానం చేసిన వెంటనే సువాసన లేని మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారకుండా, దురద రాకుండా ఉంటుంది.వైద్య చికిత్స ఎలా ఉంటుంది? శరీరంలో దురద, వాపుకు కారణమయ్యే 'హిస్టమైన్' రసాయనాన్ని అడ్డుకోవడానికి నిద్రమత్తు కలిగించని యాంటీహిస్టామైన్లు (Antihistamines) ప్రాథమిక చికిత్సగా పనిచేస్తాయి.వైద్యుల సలహాతో సెటిరిజిన్ (Cetirizine), లోరాటడిన్ (Loratadine), లేదా ఫెక్సోఫెనాడిన్ (Fexofenadine) వంటి మందుల్ని వాడాల్సి ఉంటుంది. సొంతంగా మందులు వాడకూడదు. ముఖ్యంగా దద్దుర్లు 6 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే (క్రానిక్ అర్టికేరియా) తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.ఎప్పుడు అత్యవసర చికిత్స అవసరం? దద్దుర్లతో పాటు పెదాలు, నాలుక లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం రావడం లేదా మింగడం కష్టంగా మారితే అది అనాఫిలాక్సిస్ (Anaphylaxis) అనే తీవ్రమైన అలెర్జీ కావచ్చు. దీనికి వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలి. దురదగా ఉందని గోళ్లతో గిల్లడం వల్ల చర్మంపై గాయాలై బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.దద్దుర్లు 6 వారాల లోపు తగ్గిపోతే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. 6 వారాలకు మించి తరచూ వస్తుంటే క్రానిక్ అర్టికేరియా అంటారు. క్రానిక్ సమస్య ఉన్నప్పుడు అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ లేదా బ్లడ్ టెస్టుల ద్వారా మూలకారణాన్ని కనుక్కోవడం ముఖ్యం.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ షిరీన్ ఫుర్టాడో సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ CMI హాస్పిటల్, బెంగళూరు.






