
ఇంటర్నెట్ డెస్క్: కొరియర్ పేరిట జరిగే సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) సిద్ధమైంది. బ్యాంకింగేతర సంస్థలకు కొత్తగా 1601 నంబర్ సిరీస్‌ను (1601 series) ప్రవేశపెట్టింది. ఇకపై కొరియర్, లాజిస్టిక్ వంటి సేవలకు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్‌కు ఈ సిరీస్ నంబర్లనే వినియోగించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్‌ను తీసుకొచ్చినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ సిరీస్ నంబర్‌ను అగ్రిగేటర్లు/మధ్యవర్తులకు కాకుండా టెలికాం ఆపరేటర్ల వెరిఫికేషన్ తర్వాత నేరుగా సంబంధిత కంపెనీలకే ఇవ్వనున్నారు. మొదటి దశలో యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ లావాదేవీలు/ సేవలకు ఈ సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. దీంతో సాధారణ నంబర్‌ను, అధికారిక నంబర్లకు మధ్య తేడాను యూజర్లు సులువుగా గుర్తిస్తారని పేర్కొంది. దీంతో వినియోగదారులు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం తగ్గుతుందని తెలిపింది. వాయిస్ ఆధారిత కమ్యూనికేషన్లపై మరింత విశ్వాసం పెరుగుతుందని ట్రాయ్ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకింగ్, ఆర్థిక సేవల కోసం 1600 సిరీస్‌ను అమలుచేస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.