Aug 10 2026 7:14 AM | Updated on Aug 10 2026 7:23 AM
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది.
సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో.. విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.
170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు.
“మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”.. NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికను పునరాలోచించాలని కోరారు. “ప్రజల హక్కులు, న్యాయం అందుబాటులో ఉండటం, సమస్యలపై తర్కబద్ధమైన చర్చ” వంటి అంశాలను న్యాయ విద్యలో నేర్చుకున్నామని.. అలాంటి సమయంలో నిరసనకారుల ఆరోపణలపై స్పందన విషయంలో అసంతృప్తి ఉన్న వ్యక్తిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం తమకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. అయితే అసలు సీజేఐని ఈ ఈవెంట్‌కు నల్సార్ నిజంగానే ఆహ్వానించిందా?.. ఈ అంశంపై వర్సిటీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.
మొన్న మహారాష్ట్రలోనూ.. ఇదే సమయంలో మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)లోనూ జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సిన కాన్వొకేషన్ కార్యక్రమం వాయిదా పడటం చర్చకు దారితీసింది. ఆగస్టు 2న జరగాల్సిన TISS 86వ కాన్వొకేషన్‌ను “అనుకోని పరిస్థితుల” కారణంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా.. భద్రతా కారణాలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావమా? జస్టిస్ సూర్యకాంత్‌కు సంబంధించిన గత వ్యాఖ్యలు, CJP ఉద్యమం నేపథ్యంలో ఈ పరిణామాలను పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారనే ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించినవని కొందరు భావించగా.. తాను నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పడింది. అనంతరం NEET పరీక్ష అంశంపై ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.
సౌరవ్ దాస్ ట్వీట్ మరోవైపు నల్సార్లోకాక్రోచ్ల నిరసనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ ఆయన నల్సార్‌లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో.. ఈ వ్యవహారం వెనుక సౌరవ్ హస్తం ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు.
ఒకే అంశం.. రెండు పరిణామాలు హైదరాబాద్‌లో NALSAR విద్యార్థులు నేరుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా.. ముంబైలో TISS కాన్వొకేషన్ వాయిదా చుట్టూ భద్రత, నిరసనల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు న్యాయవ్యవస్థపై గౌరవం కొనసాగాలని భావించే వర్గాలు ఉండగా.. మరోవైపు పౌర హక్కులు, నిరసనలపై న్యాయస్థానాల స్పందనను ప్రశ్నించే కొత్త తరం విద్యార్థుల గొంతు వినిపిస్తోంది. కాన్వొకేషన్ వేదికలు కేవలం పట్టాలు అందించే కార్యక్రమాలేనా? లేదంటే రాజ్యాంగ విలువలపై చర్చ జరిగే వేదికలా? అనే కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి.
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సారె సంబరం (ఫొటోలు)
విశాఖపట్నంలో అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16)
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు)
నీ కొడుకుని పదవి నుండి తొలగించు..!? లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు..!
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!
ఖబర్దార్ బోండా ఉమా.. ఒళ్లు దగ్గర పెట్టుకో! మీ ఇంటిని ముట్టడించడం ఖాయం!
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్