
TikTok | ఇంటర్నెట్ డెస్క్: చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అమెరికా ప్రభుత్వంతో రాజీకొచ్చింది. ఇందుకుగాను ఆ దేశ న్యాయ విభాగానికి (US Justice Department) 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని రెండు దఫాలలో చెల్లించనున్నట్లు వెల్లడించింది. దీంతో 2024లో దాఖలైన ఈ వ్యాజ్యం ముగిసింది. టిక్‌టాక్ తమతో రాజీ చేసుకోవడం దేశంలోని పిల్లలు, తల్లిదండ్రులకు ఒక పెద్ద విజయమని అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ స్టాన్లీ పేర్కొన్నారు. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించడం.. వారి వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా యాప్‌లు గోప్యంగా ఉంచేలా పర్యవేక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని (children's privacy) సేకరించే ముందు, పిల్లల కోసం ఉద్దేశించిన యాప్‌లు, వెబ్సైట్లు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని నిర్దేశించే ఫెడరల్ చట్టాన్ని టిక్‌టాక్, దాని చైనా ఆధారిత మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ.. 2024లో న్యాయ శాఖ వ్యాజ్యం దాఖలు చేసింది. నాటి నుంచి టిక్‌టాక్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ (ByteDance) సంస్థ తన వాటాలను తగ్గించుకుంది. దీంతో కొత్త టిక్‌టాక్ యూఎస్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ఒరాకిల్ (Oracle), సిల్వర్ లేక్, ఎమిరేట్స్ పెట్టుబడి సంస్థ ఎంజీఎక్స్ వంటి ప్రధాన పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకుంది. పిల్లల భద్రత, గోప్యతపై సోషల్ మీడియా కంపెనీలు పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలను ఎదుర్కొంటున్న తరుణంలో టిక్‌టాక్ అమెరికా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవడం గమనార్హం. మరోవైపు 1998 నాటి బాలల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం (COPPA)తో పాటు.. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు రావడంతో ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా (Meta) సైతం కోర్టు విచారణలను ఎదుర్కొంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు