
దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఆస్తికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ ఇష్యూ కాస్త సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్టు రోడ్డులో ఉన్న స్థలంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణ వరకు అక్కడ స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలను సూచించింది. 1988లో దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో వాటా కోరుతూ ఒక మహిళ, ఆమె సోదరుడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లపై ఆమె దాఖలు చేసిన దావాను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును ఆ మహిళ సవాలు చేసింది. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం, తదుపరి విచారణ జరిగే వరకు వివాదాస్పద ఆస్తిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. సంబంధిత పక్షాలకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.




