
ఒకప్పుడు ఫొటో అంటే.. అరుదైన అద్భుతం. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక... తినే తిండి.. తిరిగే ఊరు.. కొనే చొక్కా.. కలిసే మనిషి ఇలా ప్రతి క్షణం ఫొటోగా మారిపోతోంది. ఈ క్లిక్కుల ట్రాఫిక్‌లో ప్రతిదీ కావ్యం కాదు. సంధ్యాస్తమయ సమయాల్లో అందాలను బంధించడానికి, శ్రామికుల శ్రమ సౌందర్యాన్ని కళ్లకు కట్టడానికి, రెప్పపాటులో జారిపోయే జీవవైవిధ్యాలను ఒడిసిపట్టుకోవడానికి ఎంతో నిరీక్షణ, తపన కావాలి. అందుకే ఫొటోలు ఎంత సులువైపోయినా.. కొన్నే అద్భుతాలవుతాయి. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ‘ఈనాడు’ బంధించిన అలాంటి కొన్ని చిత్రాల సమర్పణ. చీకట్లు తొలగుతూ తెలవారుతున్న సమయంలో.. పాలనురగ లాంటి కెరటాలు తీరాన్ని తాకుతున్న వేళ సముద్రాన్ని తాబేలు ముద్దాడుతున్నట్లున్న ఈ సుందర దృశ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక సమీప సాగర తీరంలోనిది. అప్పుడే పుట్టిన ఆలివ్‌రిడ్లే తాబేలు పిల్ల తన ప్రపంచమైన సముద్రంలోకి వెళ్తున్నప్పుడు కెమెరాకు పని చెప్పగా.. ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఆహారం కోసం పక్షులు పడే శ్రమ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు సమీపంలోని చెరువులో తీసిన ఈ చిత్రం ఆ కోవలోనిదే. 1. కొంగజాతికి చెందిన పక్షి చెరువులో అమాంతం మునిగిపోయింది. 2. అడుగున ఉన్న చేపను చటుక్కున నోట కరుచుకుంది. 3. తన గూటికి ఎగిరిపోయింది. క్షణాల్లో జరిగిన ఈ వేటను ‘ఈనాడు’ కెమెరాలో బంధించింది. ప్రకృతిని మనం పరిశీలించాలే గాని ఒక్కో జీవిది ఒక్కో వైవిధ్యం. ఇక్కడ నేలపై కర్రపుల్లలను మోస్తూ పాకుతూ, గోడకు అంటిపెట్టుకుని, చెట్టుకు అతుక్కుని కనిపిస్తున్న ఈ జీవి పేరు కర్రపురుగు/కొమ్మపురుగు. శత్రువులకు కనపడకుండా, పక్షులు, బల్లులు నుంచి తనను తాను కర్రపుల్లల రక్షణతో కాపాడుకుంటుందని.. చెట్లు, పొదలు, ఆకుల మధ్య జీవించే ఇవి శాకాహార జీవులని, చెట్ల ఆకులను తింటూ బతుకుతాయని కానూరుకు చెందిన బయాలజీ నిపుణులు ఎన్.గోకర్ణేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో ఇవి