
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్‌కు (AUS vs BAN) రెండో టెస్టులో పెనుసవాల్ ఎదురైంది. మాక్నాయ్ మైదానంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 64 పరుగులకే కుప్పకూలింది. తొలి ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. అందులో నలుగురు డకౌట్ కావడం గమనార్హం. బంగ్లా ఆఖరి బ్యాటర్ షోరిఫుల్ ఇస్లామ్ (14*) టాప్ స్కోరర్. అతడితోపాటు మెహిదీ హసన్ (11), హసన్ మహ్ముద్ (10), తౌజుల్ ఇస్లామ్ (11*) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. చివరి వికెట్‌కు తౌజుల్ - షోరిఫుల్ 25 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌లో అత్యధికం. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6, కమిన్స్ 3, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు.
తొలి టెస్టులో ఓటమితో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఆసీస్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Starc) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బంగ్లాను బెంబేలెత్తించాడు. బంగ్లా కోల్పోయిన మొదటి నాలుగు వికెట్లను స్టార్క్ పడగొట్టాడు. తొలి బంతికే ఓపెనర్ షద్మాన్ (0)ను ఔట్ చేసిన స్టార్క్.. మరో ఓపెనర్ తన్జిద్ (0)ను కూడా డకౌట్ చేశాడు. మోమినల్ హక్ (9) కాస్త పోరాడినా అది సరిపోలేదు. స్టార్క్ బౌలింగ్‌లోనే వికెట్ సమర్పించుకున్నాడు. బంగ్లా కెప్టెన్ షాంటో (0)ను స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సీనియర్ ప్లేయర్ ముస్తాఫికర్ రహీమ్ (5) కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. లిటన్ దాస్ (5)ను స్టార్క్ ఎల్బీ చేశాడు. దీంతో 21 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. కేవలం తాను వేసిన తొలి 22 బంతుల్లోనే ఫైఫర్ తీసి స్టార్క్ అదరగొట్టాడు.
కనీసం 30 పరుగులైనా చేస్తుందా? లేదా? అనే పరిస్థితుల్లో ఉన్న బంగ్లాను (AUS vs BAN) మెహిదీ - హసన్, షోరిఫుల్ - తౌజుల్ భాగస్వామ్యాలు కాపాడాయి. మెహిదీ - హసన్ కలిసి ఏడో వికెట్‌కు తొమ్మిది ఓవర్లలో 15 పరుగులు జోడించారు. వీరితోపాటు తస్కిన్ (1) కూడా వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో 40రన్స్ కూడా కష్టమేనని అంతా భావించారు. అనూహ్యంగా షోరిఫుల్, తౌజుల్ ఆఖర్లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ ఐదు ఫోర్లు కొట్టడంతో బంగ్లా స్కోరు 64 పరుగులకు చేరుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




