© 2026 nimisham.in

SBI Funds Management IPO | ఇంటర్నెట్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు (SBI Funds Management IPO) రానుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పేరిట అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా కొనసాగుతోంది. 15.5 శాతం మార్కెట్ వాటా ఉంది. వివిధ పథకాల కింద సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది. నేటి నుంచి (జులై 14) ఈ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఓకు సంబంధించిన కొన్ని వివరాలు.. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్బీఐ ఫండ్స్ మార్కెట్ నుంచి రూ.9,813 కోట్లు సమీకరించనుంది. వాస్తవానికి రూ.11,693 కోట్ల పబ్లిక్ ఇష్యూ అనుకున్నప్పటికీ ఐపీఓ సైజ్ తగ్గింది. ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,655 కోట్లు సమీకరించడంతో ఆ మేర పరిమాణం తగ్గింది. జులై 14న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై 16న ముగుస్తుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ.545-574గా నిర్ణయించారు. సుమారు రూ.1.17 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఐపీఓకు వస్తోంది. జులై 21న లిస్టింగ్‌కు రానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తి ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో జరగనుంది. కంపెనీకి ఎలాంటి నిధులూ రావు. ఎస్బీఐ, అముండీ ఇండియా హోల్డింగ్ ఐపీఓలో భాగంగా తమ వాటాలు విక్రయిస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, స్మాల్ హెచ్ఎన్ఐలకు 5 శాతం, బిగ్ హెచ్ఎన్ఐలకు 10 శాతం, 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్లకు రిజర్వ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం 26 షేర్లు (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ వద్ద రూ.14,924 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 13 లాట్లు కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ ఉద్యోగులకు రూ.170 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేశారు. ఒక్కో షేరుపై రూ.54 డిస్కౌంట్ లభిస్తుంది. షేర్
మార్కెట్లో హెచ్చుతగ్గులు; మ్యూచువల్ ఫండ్స్ ఫీజులు; కమీషన్ల విషయంలో సెబీ ఎప్పటికప్పుడు తీసుకొచ్చే కఠిన నిబంధనలు; ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటు మరిన్ని డిజిటల్ కంపెనీలు అసెట్ మేనేజ్‌మెంట్‌లోకి ప్రవేశిస్తుండడంతో ఆ మేర లాభాల మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆయా కంపెనీలు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి.
ఎస్బీఐ ఫండ్స్ షేర్లు గ్రే మార్కెట్లో (GMP) దాదాపు 18 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీంతో రూ.680 వద్ద షేర్లు లిస్టయ్యే అవకాశం ఉంది. ఇష్యూ ధరతో పోలిస్తే రూ.106 ప్రీమియంతో షేర్లు లిస్టయ్యే అవకాశం ఉందని జీఎంపీ సూచిస్తోంది. అయితే, జీఎంపీ అంచనాలన్నీ అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు అంచనాలు తప్పొచ్చు. కాబట్టి, ఐపీఓకు దరఖాస్తు చేసేముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ వ్యాపారం, వ్యాల్యుయేషన్ వంటి అంశాలను పరిశీలించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.