

Sanju Samson : అఫ్గానిస్థాన్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికి కూడా టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, సంజూ శాంసన్ విఫలం అయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన సంజూ శాంసన్ రెండు ఫోర్లు బాది 10 పరుగులు మాత్రమే చేసి అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో దర్విష్ రసూలీ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే సంజూ శాంసన్ పైనే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ని బెంచీకే పరిమితం చేయడం పై మండిపడుతున్నారు. సంజూ కన్నా వైభవ్‌కు అవకాశాలు ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే.. మేనేజ్మెంట్ మాత్రం భారత్ కు టీ20 ప్రపంచకప్ 2026 అందించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ పైనే నమ్మకం ఉంచుతోంది. విఫలమైనా సరే అతడినే జట్టులో కొనసాగిస్తోంది.
సంజూ శాంసన్ పై భారీ ఒత్తిడి?
టీమ్ఇండియాలో సంజూ శాంసన్ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. తొలుత రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లతో, ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌తో పోటీ పడుతూ ఈ కేరళ బ్యాటర్ జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి నిరంతరం తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. అతను అడపాదడపా మాత్రమే జట్టులో కనిపించడానికి పోటీ ఒక కారణం కాగా, నిలకడ లేకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా ఉంది.
Ibrahim Zadran : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియాకు చుక్కలే .. అఫ్గాన్ కెప్టెన్..
2024లో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు శతకాలు సాధించడంతో.. శాంసన్ భారత టీ20 తుది జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా స్థానం సంపాదించుకున్నాడు. అదే సమయంలో గిల్‌ను టీ20 ఫార్మాట్ నుంచి తొలగించడంలో టీ20ల్లో అభిషేక్ తో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేస్తూ మంచి భాగస్వామ్యాలను నెలకొల్పుతూ వస్తున్నాడు.
అయితే.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాకతో జట్టులో స్థానాల కోసం కొత్త పోటీ ఏర్పడింది. వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ కూడా బరిలో ఉండటంతో శాంసన్ జట్టులో తన స్థానాన్ని నిలకడగా నిలబెట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండడం కూడా సంజూకు మైనస్‌గా మారుతోంది.
అఫ్గాన్‌తో తొలి టీ20లో విఫలం కావడం సంజూ శాంసన్ పై ఒత్తిడి పెంచేదే. అయితే.. ఒక్క ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన అతడిని తక్కువ అంచనా వేయకూడాదు. రెండో టీ20లోనూ విఫలం అయితే మాత్రం అతడికి తిప్పలు తప్పకపోవచ్చు. సూర్యవంశీ వేగంగా ఎదగడం, అతనికి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, అతడిని జట్టులోకి తీసుకోకపోయినా అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరూ కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు.





