
తిరుమల (Tirumala) కొండల్లో భక్తుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ (TTD) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, ప్రమాదం ఏర్పడే అవకాశాలను తగ్గించేందుకు ఆధునిక రోబోట్‌ను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా మనుషులు వెళ్లడం కష్టంగా ఉండే ప్రాంతాల్లో ఈ పరికరం ద్వారా నిఘా పెట్టడం వల్ల అటవీ, భద్రతా సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి (C.H. Venkaiah Chowdary) గురువారం పద్మావతి అతిథిగృహం వద్ద రోబోట్ డాగ్ పనితీరును పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి దాని సామర్థ్యాలను తెలుసుకున్నారు. అడవుల్లో చిరుతలు, ఇతర జంతువుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీనిని ఎలా వినియోగించవచ్చనే అంశంపై వివరాలు సేకరించారు. భక్తులు ప్రయాణించే మార్గాలకు సమీపంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఇది ఎంతవరకు సహాయపడుతుందనే దానిపై కూడా చర్చించారు. ఈ నాలుగు కాళ్ల రోబోట్‌లో అనేక ఆధునిక పరికరాలు ఉన్నాయి. సాధారణ కెమెరాతో పాటు థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ రకాల సెన్సార్లు ఇందులో అమర్చారు. కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో వెలుతురు తక్కువగా ఉన్న సమయంలోనూ పరిసరాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. పొగమంచు లేదా చీకటి వంటి పరిస్థితుల్లో కూడా కదులుతున్న జీవులు, మనుషులు, వాహనాలను గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోబోట్ సేకరించే సమాచారాన్ని కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి వివిధ వస్తువులు, జీవులను ప్రత్యేకంగా గుర్తించేలా రూపొందించారు. ఉదాహరణకు పెద్ద జంతువు కనిపిస్తే దాన్ని మనిషి లేదా వాహనంతో కలిపి చూడకుండా ప్రత్యేకంగా గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ప్రమాదకరమైన ప్రాంతంలో వన్యప్రాణి కదలిక గుర్తించినప్పుడు దాని స్థానాన్ని ఆధారంగా చేసుకుని సంబంధిత సిబ్బందికి హెచ్చరికలు పంపే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలిపిరి (Alipiri) నుంచి తిరుమలకు