
ఆర్యవైశ్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు ఉప్పల్‌ భగాయత్‌లో ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన తమ ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని భరోసా ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్, ఉప్పల్, న్యూస్‌టుడే: రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలంటే.. తగిన అవకాశాలు, ప్రాధాన్యం పొందాలంటే ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌లో ఆదివారం ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ప్రసంగించారు. ఆర్యవైశ్య సమాజం ఆర్భాటాలు, ప్రచారాలకు దూరంగా ఉండటంతో రావాల్సినంత గుర్తింపు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్‌ పదవి ఇచ్చామని.. కొడంగల్‌లోని మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చామని గుర్తు చేశారు. ‘‘సమాజ సంక్షేమానికి మీరు అందిస్తున్న తోడ్పాటును గుర్తించి ప్రభుత్వం మీ వెన్నంటి ఉంటుంది. ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారంతో పాటు అవసరమైన అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. నేను మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తా. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం కలిగిన వారు. చాలామంది పేదలు ఉన్నా పేదరికాన్ని కడుపులోనే దాచుకుని గౌరవంతో జీవించే స్వభావం మీది. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పూచీకత్తు లేకపోయినా పేదలకు ఆర్థిక సహాయం చేసే కమ్యూనిటీ’’ అని సీఎం కొనియాడారు. ‘‘ప్రపంచంలో వ్యవసాయం, వ్యాపారం అనే రెండు ప్రధాన వృత్తులు ఉన్నాయి. వ్యాపారంలో రాణించి ఆటుపోట్లను ఎదుర్కొన్న అనుభవం ఆర్యవైశ్యుల సొంతం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, వివాహాలు, వాహనాల కొనుగోలు వంటి నిర్ణయాల్లో మీ సలహాలు తీసుకుంటారు. ముందుచూపు అనేది మీ రక్తం, డీఎన్‌లోనే ఉంది. ఈ ఆత్మ గౌరవ భవనం పేద ఆర్యవైశ్య కుటుంబాలకు సంపూర్ణంగా ఉపయోగపడాలి. ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి.. చిత్రంలో నవీన్‌యాదవ్, దయానంద్‌ గుప్తా, రజితారెడ్డి, బొంతు శ్రీదేవి, సూర్యనారాయణగుప్తా, గణేశ్‌గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, టీజీ వెంకటేశ్, అమరవాది లక్ష్మీనారాయణ, మధుయాస్కీ తదితరులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు మహాత్మాగాంధీ. ఆయన ఆర్యవైశ్యుల బిడ్డ కావడం దేశానికే గర్వకారణం. లాలాలజపతిరాయ్, సీతారాం కేసరి, పెండేకంటి వెంకటసుబ్బయ్య వంటి ప్రముఖ నాయకులు ఈ సామాజికవర్గం నుంచి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశేష సేవలు అందించారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నేను మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నప్పుడు రోశయ్య దగ్గరికి పిలిచారు. నా రాజకీయ భవిష్యత్తుపై దిశా నిర్దేశం చేశారు. ఆవేశంతో కాదు అనుభవంతో ముందుకెళ్తే రాజకీయాల్లో పైకి వస్తావని సుదీర్ఘ భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు. రోశయ్యకు సముచిత గౌరవాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేస్తే కొంతమంది విమర్శలు చేశారు. ‘నాలుగు దశాబ్దాల క్రితమే నేను బల్కంపేటకు వచ్చా.. మంచైనా, చెడైనా నాకు హైదరాబాదే’ అని రోశయ్య ఒక సందర్భంగా చెప్పారు. ఆయన మాటలు గౌరవించి నగరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో పాల్గొన్న ఆర్యవైశ్యులు ‘సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినంత గట్టితనం చేతల్లో ఉండదు.. అదే గట్టితనం ఉంటే తెలంగాణలో ఎంతో మంది కటకటాల్లోకి పోయేవారు’ అని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. సూర్య భగవానుడు ఎలా వెలుగునిస్తున్నారో.. అలాగే సీఎం తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నారంటూ రేవంత్‌ పేరు గురించి వర్ణించారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తన వంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి డా.వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, సూర్యనారాయణగుప్తా, ప్రకాశ్‌గౌడ్, నవీన్‌యాదవ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్తా, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, దామోదర్‌గుప్తా, మాజీ కార్పొరేటర్లు రజితారెడ్డి, బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





