
ఇంటర్నెట్ డెస్క్: తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ దర్శక-నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కించారు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma). అయితే, తన సినిమాలకు సంబంధించి సినీ కార్మికులకు, ఇతర సిబ్బందికి ఇవ్వాల్సిన రూ.1.32 కోట్లను చెల్లించకుండా 9 ఏళ్లుగా ఆయన పెండింగ్‌లో పెట్టినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బి.ఎన్.తివారి(BN Tiwari) పేర్కొన్నారు. దీంతో ఆయన తాజా చిత్రం ‘పోలీస్ కంపెనీ’(Police Company) ముహూర్తం రోజున షూటింగ్‌ను ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అడ్డుకున్నట్లు తెలిపారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో ఆర్జీవీ బకాయిలను చెల్లించినట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బి.ఎన్.తివారి వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలివీ.. ‘‘సర్కార్’, ‘సర్కార్ 3’ సహా పలు చిత్రాలకు పనిచేసిన కార్మికులకు రామ్‌గోపాల్ వర్మ బకాయిలు చెల్లించలేదు. ఆ చిత్రాల్లో కొన్ని విడుదల కాగా, మరికొన్ని రిలీజ్ కాలేదు. బకాయిల నుంచి తప్పించుకోవడానికి ఆయన మాతో దాగుడుమూతలు ఆడారు. 2019లో ఒకేదఫాలో మొత్తం బకాయిలు చెల్లిస్తానంటూ మాకు లేఖ రాశారు. ఆ తరువాత ముంబయిలో ఆఫీసు మూసేసి మాయమైపోయారు. ఆయన కోసం మేం వెతుకుతుండగా గోవాలో కనిపించారు. అప్పుడు త్వరలోనే ఫుల్ పేమెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ రహస్యంగా చిన్న సినిమాలు తీశారు. ఇన్నేళ్ల తరువాత ‘పోలీస్ కంపెనీ’ షూటింగ్ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చారు. ఆ విషయం తెలియడంతో ముహూర్తం రోజునే మేం షూటింగ్‌ను అడ్డుకున్నాం. ఈ వ్యవహారంలో కొందరు పెద్ద వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో ఆర్జీవీ దిగొచ్చి బకాయిలు మొత్తం చెల్లించారు. దీంతో మేం షూటింగ్‌కు అంతరాయం కలగనివ్వలేదు’’ అని బి.ఎన్.తివారి చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి