
టాలీవుడ్ నటి ప్రగతి తన కెరీర్ ప్రయాణాన్ని, ముఖ్యంగా టాలీవుడ్లో దర్శకుల పాత్రను, వర్షం పాటలతో ఆమెకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక కళాకారిణిగా తన ఎదుగుదలకు, తనలో నటనకు సంబంధించిన కొత్త పార్శ్వాలను వెలికితీయడానికి దర్శకులే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. డైరెక్టర్స్ డే సందర్భంగా, తన కెరీర్లో పనిచేసిన ఎంతోమంది దర్శకులకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి మాట్లాడుతూ, “ఒక ఆర్టిస్ట్ ఎదగాలన్నా, ఒక ఆర్టిస్ట్ గురించి జనాలు మాట్లాడుకోవాలన్నా, ప్రతి దానికీ కారణం ఒక డైరెక్టర్. డైరెక్టర్ అనేవాడు ప్రతి సినిమాకి మెయిన్ పిల్లర్. నేను డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో పనిచేసినప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చూస్తూ ఉంటాను. నాలో నేను కొత్త యాక్టర్ ని చూస్తూ ఉంటాను. ఆ క్రెడిట్ మొత్తం ఆ డైరెక్టర్ గారికే వెళ్తుంది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న దర్శకుడితో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని, ఆయన కూడా తనతో కొత్తగా ప్రయత్నిస్తున్నారని, ఇది తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.





