
కాలువలో గల్లంతైన బాలుడు మృతి మండపేట, న్యూస్‌టుడే: పాఠశాల నుంచి ఇంటికొస్తూ మంగళవారం సాయంత్రం కాలువలో గల్లంతైన సిద్ధాంతపు నాగశివ దుర్గాప్రసాద్‌(11) మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. రామచంద్రపురం పంటకాలువలో మత్స్యకారులు వలలు వేసి గాలించగా పులగుర్త దాటిన తర్వాత ఇటుకల బట్టీ సమీపంలోని తుప్పల్లో మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు బాలుడి మృతితో దుఃఖసంద్రంలో మునిగారు. దీంతో బస్టాండ్‌ వెనుక పల్లీలవీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు, బాలుడి బంధువుల వివరాల ప్రకారం.. ఆరో తరగతి చదువుతున్న దుర్గాప్రసాద్‌ మంగళవారం ఉదయం ఆటోలో పాఠశాలకు వెళ్లాడు. ఇతని అన్న కృష్ణచైతన్య కూడా అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల విడిచిపెట్టిన తరవాత బాలుడు ఆటో ఎక్కకపోవడంతో అతని అన్నతో కలిసి సైకిల్‌పై వెళ్లాడని భావించిన ఆటోడ్రైవర్‌ మిగిలిన పిల్లలతో వెళ్లిపోయాడు. రోజూలానే తమ్ముడు ఆటోలో వెళ్లి ఉంటాడని భావించిన అన్న సైకిల్‌పై ఇంటికి వెళ్లాడు. పాఠశాల వద్ద ఆటో ఎక్కకుండా దుర్గాప్రసాద్‌ పెదకాలువ గట్టుకు వెళ్లాడు. పుస్తకాల సంచి, బూట్లు, సాక్సులను ఒడ్డునే ఉంచి స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు. అయితే ఈత రాకపోవడంతో మునిగి గల్లంతయ్యాడు. అదే సమయంలో స్నానానికి వచ్చిన భవానీమాల ధరించిన భక్తుడు ఒడ్డునున్న పుస్తకాలు, బూట్లు ఐడీ కార్డును చూసి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి బాలుడు ఒంటరిగానే వచ్చినట్లు గుర్తించారు. అంతకు ముందు రోజు తన తండ్రితో అదే ప్రాంతంలో చిన్నారి స్నానం చేసి వచ్చినట్లు బంధువులు తెలిపారు. అక్కడే ప్రాణాలు కోల్పోయాడని విలపిస్తున్నారు. చదువులో చలాకీగా ఉండేవాడని అంతా అన్నారు. ఎస్సై రాము కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





