
NVIDIA CEO | ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ రాకతో ఓవైపు టెక్ కంపెనీల్లో వరుస లేఆఫ్‌లు కలవరపెడుతున్నాయి. మరోవైపు గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఏఐ కారణంగా పెద్దఎత్తున డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. వీటివల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండబోవన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్ రంగానికి అతీతంగా ఏఐ అధిక వేతన ఉద్యోగాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. డేటా సెంటర్ల నిర్మాణంతో ఇది సాధ్యం కానుందని చెప్పారు. కానీ వైట్ కాలర్ రంగంలో మాత్రం ఆ అవకాశం ఉండకపోవచ్చన్నారు. ‘‘ఏఐ రాకతో టెక్ రంగంలో కాకుండా ఇతర రంగాల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లపై టెక్ కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. దశాబ్దం చివరి నాటికి దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు పెట్టుబడులు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన, నైపుణ్యం కల్గిన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు..తదితర శ్రామికుల కొరత ఉంది. రాబోయే రోజుల్లో ఏఐ డేటా సెంటర్లు భారీగా రానున్నాయి. వాటి నిర్మాణం, నిర్వహణకు ప్లంబర్లు, సూపర్ వైజర్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. నైపుణ్యం ఉన్న వర్కర్లు ఏడాదికి లక్ష డాలర్లు (సుమారు రూ.84 లక్షలకు పైగా) సంపాదించొచ్చు’’ అని తెలిపారు. ఏఐ యుగంలో మంచి ఆదాయం పొందడానికి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేయాల్సిన అవసరంలేదన్నారు. నైపుణ్యాధారిత పనులు వచ్చిన వారికి కూడా సురక్షిత భవిష్యత్తు ఉంటుందన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత