
కరీంనగర్‌ జిల్లా తనుగులలో ఘటన జమ్మికుంట, న్యూస్‌టుడే: కుమారుడు నిత్యం మద్యం తాగి గొడవపడటం, డబ్బులు అడగడం, చేసిన అప్పులు తీర్చేందుకు పొలం విక్రయించాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన ఓ తల్లి... కుమార్తె, అల్లుడి సాయంతో కుమారుడిని హత్యచేసి ఓ పొలంలో ఖననం చేసిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. హత్యకు సంబంధించిన వివరాలను హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి బుధవారం వెల్లడించారు. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ఒజ్జపల్లి రాజబాబు(35) జమ్మికుంటలో తల్లి లచ్చమ్మతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తాను చేసిన అప్పులు తీర్చేందుకు భూమిని విక్రయించాలని ఒత్తిడి చేయగా తల్లి లచ్చమ్మ, అక్క కవిత, బావ జూపాక శంకర్‌ నిరాకరించారు. దీంతో ఈ నెల 7న రాజబాబు జమ్మికుంట మండలం తనుగులలోని తన సోదరి ఇంటికెళ్లి గొడవ పడి..ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశాడు. దీనిపై వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రాజబాబు తప్పును అంగీకరించాడు. మళ్లీ ఈ నెల 10న రాజబాబు మద్యం తాగొచ్చి సోదరి ఇంటి కెళ్లి గొడవ చేశాడు. దీంతో విసిగిపోయిన తల్లి... కుమార్తె, అల్లుడితో కలిసి మరికొందరు శంకర్‌ మిత్రులు మారపల్లి రాజయ్య, చేతి వెంకటేశ్, జూపాక సతీశ్, కుంటి శంకర్‌లు రాజబాబును మంచానికి కట్టేసి చున్నీతో ఉరేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతదేహాన్ని శంకర్‌ తన పొలంలో ఖననం చేశారు. రాజబాబు అదృశ్యంపై మంగళవారం జమ్మికుంటలోని ఇంటి యజమాని సత్యనారాయణ ఫిర్యాదు చేయగా... దర్యాప్తులో భాగంగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నేరాన్ని అంగీకరించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





