© 2026 nimisham.in
తెలంగాణలో నిషేధిత22ఏ భూముల జాబితా వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు నిషేదిత 22ఏ జాబితాలోకి చేరటం, వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో భూ యజమానులు, ప్లాట్ల యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యవహారం కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 22ఏ జాబితాలో చోటుచేసుకున్న లొసుగుల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.22ఏ జాబితా అంశంపై ప్రభుత్వం త్వరలోనే సమగ్ర విచారణ చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా సరే.. ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భూములను నిషేదిత జాబితాలో చేర్చే ప్రక్రియలో ఎక్కడ లోపాలు జరిగాయి..? ఎవరి ఆదేశాలతో మార్పులు చోటు చేసుకున్నాయి..? ఏ స్థాయిలో అధికారుల ప్రమేయం ఉంది..? అనే పూర్తి అంశాలు విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కొందరు అధికారుల పాత్ర కూడా ఈ వ్యవహారం వెనుక ఉండి ఉండొచ్చునని తాను బలంగా అనుమానిస్తున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాగా, ప్రభుత్వ విచారణలో అధికారులు, రికార్డులు, భూముల వర్గీకరణ, డిజిటల్ డేటాలో జరిగిన మార్పులు వంటి అంశాలు పరిశీలించే అవకాశం ఉంది.రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా 22Aరెవెన్యూ నిబంధనల ప్రకారం కొన్ని రకాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వాటి రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తారు
. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో భూములు 22ఏ జాబితాలోకి చేరినట్లు వస్తున్న వార్తలు భూ యజమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ భూములు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిషేధిత జాబితాలోకి చేర్చారని అప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు.సాధారణంగా భూమి 22ఏ జాబితాలోకి చేరితే సాధారణంగా దాని విక్రయం, బదలాయింపు, రిజిస్ట్రేషన్ వంటి లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ఇప్పటికే భూములు కొనుగోలు చేసినవారు, విక్రయించాలనుకునే వారు, బ్యాంకు రుణాల కోసం ఆస్తిని వినియోగించుకునే వారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో రియల్ ఎస్టేట్ రంగంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 22ఏ జాబితాలోకి భూములు ఎలా చేరుతున్నాయి.. ఇప్పటికే ఉన్న రికార్డుల్లో మార్పులు జరిగాయా.. సాంకేతిక పరిపాలనా లోపాల కారణంగానే నిషేధిత జాబితాలోకి వెళ్లాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ ఇష్యూపై సమగ్ర విచారణ జరిపిస్తే కానీ వాటిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.