
Chatgpt Finds Lost Footwear : గుడికి వెళ్లిన సమయంలో.. ఏదైనా రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనం ఓ ప్రాంతంలో చెప్పులు విడుస్తాం. మళ్లీ వాటిని తీసుకొనేందుకు వస్తే.. గుంపులుగుంపులుగా చెప్పులు పేరుకుపోయి ఉండటంతో.. మన చెప్పులను గుర్తించడంకోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అయితే, ఓ వ్యక్తి గుడి వద్ద గుంపుగా ఉన్న చెప్పులను ఫొటో తీసి ఆ ఫోటోను చాట్ జీపీటీలో పోస్టు చేశాడు. ఆ తరువాత తన చెప్పులకు సంబంధించిన వివరాలను పొందుపర్చి వాటిని గుర్తించాలని కోరాడు.. కొద్ది నిమిషాల్లోనే చాట్ జీపీటీ తనకు కావాల్సిన చెప్పులను గుర్తించింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రోజువారీ జీవితంలో ఎలాంటి చిన్నచిన్న పనులకు కూడా ఉపయోగపడుతుందో చూపించే ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వందలాది జతల చెప్పుల మధ్య తనకు చెందిన క్లాగ్స్ రకం చెప్పులను గుర్తించేందుకు ఓ వ్యక్తి చాట్ జీపీటీ సాయం తీసుకున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ప్రాంతంలో వందలాది మంది తమ పాదరక్షలను బయట ఉంచారు. అక్కడ వెయ్యికిపైగా జతల చెప్పులు, ఇతర పాదరక్షలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ గందరగోళంలో ఓ వ్యక్తి తన క్లాగ్స్రకం చెప్పులను పోగొట్టుకున్నాడు. చుట్టూ ఉన్న పాదరక్షలన్నింటినీ స్వయంగా వెతకడం కష్టంగా మారడంతో అతడు వినూత్నంగా ఆలోచించాడు. అక్కడ ఉన్న చెప్పుల సమూహాన్ని ఫొటో తీసి చాట్ జీపీకి అందించాడు. తన క్లాగ్స్ రకం చెప్పులను గుర్తించి చూపించాలని ఏఐని కోరాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి తీసిన ఫొటోను చాట్ జీపీటీ ద్వారా విశ్లేషించిన తర్వాత తనకు కావాల్సిన క్లాగ్స్ను గుర్తించేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటికే అతడు తన పాదరక్షలను గుర్తించినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటన చూసిన చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. చాట్ జీపీని ఇలా కూడా ఉపయోగించవచ్చని నాకు తెలియదు అంటూ ఓ నెటిజన్ స్పందించగా.. మరికొందరు మాత్రం సరదాగా స్పందిస్తూ.. ఇంత కష్టపడటం ఎందుకు.. నచ్చిన మరో జత తీసుకుని వెళ్లిపోయేవాళ్లం అంటూ కామెంట్లు చేశారు. ఏదేమైనా.. పోయిన చెప్పుల కోసం చాట్ జీపీటీ సాయం తీసుకుని, చివరకు వాటినే గుర్తించి పట్టుకోవడం ఇప్పుడు నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మారింది.





