© 2026 nimisham.in

Lenin Movie Review || చిత్రం: లెనిన్; నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ; సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ; రచన, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరి; విడుదల: 10-07-2026 అఖిల్ అక్కినేని ఓ బలమైన విజయం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దాంతో కొంత విరామం తీసుకుని ఇప్పటివరకూ తాను చేయని ఓ విభిన్నమైన కథని ఎంచుకుని ‘లెనిన్’ చేశారు. తనని మాస్ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే సినిమా అవుతుందని నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఆయనకు విజయాన్ని అందించింది? మాస్ పాత్రలో అఖిల్ ఎలా ఒదిగిపోయారు? Lenin Movie Story || చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరు అది. అక్కడకు లెనిన్ (అఖిల్) అనే ఓ అనాథ ఆకలితో వస్తాడు. ఆ గ్రామానికి చెందిన పెద్దింటి మహిళ (ఈశ్వరీరావు) చేరదీసి అన్నం పెడుతుంది. ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు), లెనిన్ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వసంత్ చదువుల కోసం పట్నం వెళ్లగా, లెనిన్ మాత్రం ఊళ్లోనే ఉంటూ ఆ కుటుంబానికి తలలో నాలుకలా మెలుగుతుంటాడు. ఊళ్లో 18 రోజులపాటు ఎంతో పవిత్రంగా జరిగే భారతం మెట్ట ఉత్సవాల నిర్వహణ బాధ్యతని తన భుజాలపై వేసుకుని నడిపిస్తుంటాడు లెనిన్. తనకు భారతి (భాగ్యశ్రీ బోర్సే) అంటే ప్రాణం. వైద్యం చదువుకుని ఊరికొచ్చిన వసంత్ స్వయంగా లెనిన్, భారతి వివాహాన్ని జరిపిస్తాడు. ఆ ఊళ్లో ఉత్సవాల ఆఖరి రోజు అనూహ్యంగా ఓ సంఘటన జరుగుతుంది. దాంతో భారతం మెట్ట ఎంతకీ ఆరని అగ్నిగుండంలా రగిలిపోతుంది. లెనిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి బయటికొచ్చిన లెనిన్ నేరుగా ఎక్కడికి వెళ్లాడు? ఏం చేశాడు? అసలు అతను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అందుకు కారకులెవరు? తన ప్రాణ స్నేహితుడైన లెనిన్ కోసం వసంత్ ఏం
చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
Lenin movie review || శ్రీరామపురం అనే గ్రామంలో జరిగే మహాభారతంలాంటి ఓ కథ ఇది. రంగులు మార్చే పాత్రలు, కురుక్షేత్రాన్ని తలపించే పోరాటంలో చివరికి మిగిలిందెవరన్నది ఇందులో కీలకం. స్వార్థం, ప్రేమ, ప్రతీకారం, గౌరవం కోసం వేసే ఎత్తుగడలతో కూడిన ఓ గ్రామీణ యాక్షన్ డ్రామా. ఈ కథకు, చిత్తూరు జిల్లాలో నిజంగానే జరిగే భారతం మెట్ట జాతర నేపథ్యం తోడు కావడమే ఈ సినిమా ప్రత్యేకత. భారతం మెట్ట ఉత్సవాల్ని పరిచయం చేస్తూ సాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, కథానాయకుడు జైలు నుంచి బయటకొచ్చే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. కథలో వేగంగానే లీనం చేస్తుంది. కానీ, ఆ తర్వాత సన్నివేశాల్ని అందుకు దీటుగా రాసుకోవడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే తెరపై కనిపిస్తుంటాయి. హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథలో కానీ, గ్రామంలో చోటు చేసుకునే సంఘటనల్లో పెద్దగా కొత్తదనం కనిపించదు. పక్కా కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమా సాగిపోతుంది. విరామానికి ముందు సన్నివేశాలతోనే కాస్త సినిమా గాడిన పడినట్టు అనిపిస్తుంది. పాత్రలు రంగులు మార్చడం అక్కడ్నుంచే మొదలవుతుంది. దాంతో కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. విరామ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
అదే ఊపులోనే ద్వితీయార్ధం మొదలవుతుంది. వసంత్ ప్రేమ, పెళ్లి కథ, యతిరాజులు పాత్ర చేసే హంగామా, గాంధారిని తలపించేలా పెద్దమ్మ పాత్ర తీసుకునే నిర్ణయం... ఇలా ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. ఆ నేపథ్యంలోనే కథలో చోటు చేసుకునే మలుపులు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. ఆఖరి సన్నివేశం వరకూ కథలో చోటు చేసుకునే మలుపులు ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తుంటాయి. బోలెడన్ని పాత్రలు, మరింత డ్రామా పండించేందుకు కావల్సిన నేపథ్యం ఉన్నా, ఫస్ట్ హాఫ్ తాలూకా అసంతృప్తిని చాలావరకు ద్వితీయార్ధం తగ్గిస్తుంది. ఇప్పటివరకూ అర్బన్ పాత్రలు, కథల్లోనే ఎక్కువగా కనిపించిన అఖిల్ ... పక్కా పల్లెటూరి యువకుడిగా చేసిన సందడి, నటనలో చూపించిన వైవిధ్యం ఈ సినిమాకి కలిసొచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.