
ఈ పచ్చడిని ఉదయం అల్పాహారంతో పాటు సర్వ్ చేయవచ్చు. ఇడ్లీ, దోశతో పాటు వేడి అన్నంలో కూడా తింటే మంచి రుచిని ఇస్తుంది. మరి నోరూరించే బెండకాయ పచ్చడిని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా తుడిచిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
కడాయిలో నూనె వేసి వేడయ్యాక బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. బెండకాయలోని జిగురు తగ్గి ముక్కలు మెత్తగా, కొద్దిగా వేగినట్లు అయ్యే వరకు ఉంచాలి.
ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
చిన్న కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపును బెండకాయ పచ్చడిపై వేసి బాగా కలపాలి.
అంతే.. రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి ఇడ్లీ, దోశ లేదా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు.
బెండకాయను కట్ చేసే ముందు పూర్తిగా తేమ లేకుండా తుడుచుకోవడం మంచిది. అలాగే పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేస్తే రుచి మరింత బాగుంటుంది.





