
Israel Cancels All Military Leaves Is Netanyahu Preparing A Fresh Strike On Iran
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ (Israel)లో సైనికులను ఉన్న అన్ని సెలవులను ఆ దేశ ఆర్మీ రద్దు చేసినట్లు (Cancels All Military Leaves) అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారు
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ (Israel)లో సైనికులను ఉన్న అన్ని సెలవులను ఆ దేశ ఆర్మీ రద్దు చేసినట్లు (Cancels All Military Leaves) అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారు వెంటనే తిరిగి సైన్యంలో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై కొత్త దాడులు ప్రారంభించనుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై మొదటిసారి దాడులు చేపట్టడానికి కొన్ని గంటల ముందు కూడా ఆ దేశం సైనికులకు ఇటువంటి ప్రకటనే చేసింది. దీంతో ఇప్పుడు కూడా పెద్ద స్థాయిలో దాడులు చేపట్టడానికి ఆ దేశ సైన్యం సిద్ధమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
యుద్ధం కారణంగా గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడుతుండడంతో.. దాడులను ఆపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే నెతన్యాహు (Netanyahu) మాత్రం యుద్ధం కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అమెరికా సాయం లేకుండా సొంతంగా టెహ్రాన్‌పై విరుచుకుపడడానికి (Strikes On Iran) సైన్యం సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు తెలిపాయి. ఇరాన్‌లోని కీలక నేతలు, ఐఆర్జీసీ అధికారులే లక్ష్యంగా దాడులు చేయడానికి ఇప్పటికే నెతన్యాహు సైనికాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌తో యుద్ధం ముగింపు, గాజాలో దాడుల నిలుపుదల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను నెతన్యాహు వ్యతిరేకించారు. గాజా విషయంలో అగ్రరాజ్య ప్రతిపాదనలను అంగీకరించబోమని.. హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టేంతవరకు వెనక్కి తగ్గబోమని ప్రకటించారు
ఇజ్రాయెల్ మరోసారి తమపై దాడి చేస్తే.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని ఇరాన్ శనివారం హెచ్చరించింది. టెల్ అవీవ్‌లోని చమురు రిఫైనరీలు, కీలక కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని పేర్కొంది. వ్యూహాత్మక హర్మూజ్ ప్రాంతం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాకు సూచించింది. ఇరాన్‌పై యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని.. దాడుల కారణంగా జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






