
తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పరిపాలన కంటే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే పెను సవాలుగా మారుతున్నాయి. అధికారం చేపట్టిన తొలినాళ్లలో దూకుడు ప్రదర్శించిన నాయకత్వం.. సొంత పార్టీలోని సీనియర్లు, వలస నేతల అసంతృప్తిని దారికి తేవడంలో మాత్రం తడబడుతోందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధిష్టానాన్ని నేరుగా టార్గెట్ చేయకుండా, కేవలం సీఎం రేవంత్‌ను మాత్రమే కేంద్రబిందువుగా చేసుకుని నేతలు సాగిస్తున్న స్వరం రోజురోజుకూ శృతిమించుతోంది. ఎన్నికల సమయంలో తన అనుకూల వర్గానికి టికెట్లు ఇప్పించుకుని, వారిని గెలిపించుకున్నారనే ఆరోపణలు మొదటి నుంచీ రేవంత్‌పై ఉన్నాయి. ఆ సమయంలో అధికారమే లక్ష్యంగా అంతా సర్దుకుపోయినా, ప్రభుత్వం ఏర్పడ్డాక సీనియర్లను విస్మరిస్తున్నారనే భావన పాత కాంగ్రెస్ నేతల్లో అసహనాన్ని పెంచింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడం, నామినేటెడ్ పదవుల జాప్యం, పార్టీలో ప్రాధాన్యం తగ్గడం వంటి అంశాలు అంతర్గత అసంతృప్తిని రాజేస్తున్నాయి. కేబినెట్ పదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి ఏడాది నుంచే సీఎంను లక్ష్యంగా చేసుకుని గళమెత్తుతున్నారు. సీఎం మార్పు ప్రస్తావన తెస్తూ, ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నామనే సంకేతాలు ఇవ్వడం ప్రభుత్వ స్థిరత్వంపై చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్లు నిధుల కొరత, నిర్లక్ష్యంపై బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. దానం నాగేందర్ లాంటి నేతలు గత పాలనను ప్రస్తావిస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేత చిన్నారెడ్డి టికెట్ల కేటాయింపు వ్యవహారాలపై విమర్శలు గుప్పించగా, పార్టీ వీడిన జీవన్ రెడ్డి తరచూ సీఎం శైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. విజయశాంతి ప్రభుత్వ విధానాలపై పెదవి విప్పగా, తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఏకంగా పరకాల టికెట్ కేటాయింపు, కుటుంబానికి ఎమ్మెల్సీ నిరాకరణ వంటి అంశాలపై సీఎం కుటుంబ సభ్యులను సైతం టార్గెట్ చేస్తూ స్వతంత్ర పోరుకు