
హిమాలయాలు ఎంత అందంగా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లటి మంచుతో కప్పేసి, మండే ఎండల్లోనూ చల్లదనాన్ని పంచుతాయి.అలాంటి హిమాలయాల్లో మనం ఊహించని భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎత్తైన కొండల మధ్యలో.. రద్దీగా ఉండే నగరాలకు దూరంగా, బిజీ రహదారులు ఏమీ లేని ఓ అందమైన సరస్సు ఉంది. ఈ సరస్సు చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షించేలా ఉంటుంది. కానీ, ఒక్కసారి ఆ సరస్సులో మంచు కరిగితే.. దానిలోని అస్థిపంజరాలన్నీ బయపడతాయి. అదే రూప్ కుండ్ సరస్సు. దీనిని అస్థిపంజరాల సరస్సు అని కూడా పిలుస్తారు. మరి, ఆ సరస్సులో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి?
ఈ రూప్ కుండ్ సరస్సును చూడటానికి ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. దట్టమైన అడవుల మధ్యలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే.. సముద్ర మట్టానికి 5వేల మీటర్లపైగా ఎత్తులో మంచుతో గడ్డకట్టిన సరస్సు ఒకటి ఉంటుంది. అదే రూప్ కుండ్ సరస్సు. దీని వెడల్పు కేవలం 40 మీటర్లు మాత్రమే. దాదాపు ఇది ఎప్పుడూ మంచుతో గడ్డకట్టుకొనే ఉంటుంది. కానీ.. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సమయంలో మాత్రమే మంచు కొద్దిగా కరుగుతుంది. అప్పుడు ఈ అస్థిపంజరాలు కనపడతాయి. ఇక్కడ అస్థిపంజరాలు ఉండటాన్ని 1942లో హరి కిషన్ మాద్వాల్ అనే ఫారెస్ట్ రేంజర్ కనుగొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికుల ఎముకలు అని మొదట అనుకున్నారు. కానీ, పరిశోధనల్లో అవి శతాబ్దాల నాటి ప్రాచీన అస్థిపంజరాలు అని తేలింది.
ఈ అస్థిపంజరాల సరస్సు వెనక చాలా కథలు వినపడుతూ ఉంటాయి. భయంకరమైన వడగండ్ల వాన పడి చనిపోయారని అక్కడివారు నమ్ముతారు. ఆ సరస్సులో లభించిన అస్థిపంజరాల పుర్రెలపై గుండ్రని వస్తువుల కారణంగా ఏర్పడిన గాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే, ఆకాశం నుంచి పడిన అతి పెద్ద వడగండ్ల వాన కారణంగా చనిపోయారని కొందరు నమ్ముతుంటారు.
అయితే, తాజా నివేదికల ప్రకారం ఈ అస్థిపంజరాలు ఒకే సమూహానికి చెందినవి కావు. ఇవి దాదాపు 1,000 సంవత్సరాల వ్యవధిలో, వేర్వేరు సమయాల్లో మరణించిన వేర్వేరు వ్యక్తులవని తేలింది. మరీ విస్తుపోయే విషయమేమిటంటే.. వీరిలో కొందరు భారతదేశానికి చెందినవారు కూడా కారు. వారి DNA ఆగ్నేయాసియా , మధ్యధరా ప్రాంతాలకు (Mediterranean) చెందిందని తేలింది. అంటే ఈ ప్రదేశం శతాబ్దాలుగా ఎన్నో విషాదాలను చూసింది, కానీ అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు.
స్థానిక కథల ప్రకారం, రాజు జస్ధవాల్ తన గర్భవతి అయిన రాణి, నాట్యగత్తెలు, సేవకుల పెద్ద బృందంతో కలిసి నందాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి పవిత్ర యాత్రకు బయలుదేరాడు. కానీ వారి ప్రవర్తన వల్ల అమ్మవారికి కోపం వచ్చింది. ఫలితంగా, ఆమె భయంకరమైన తుఫానును సృష్టించి, సరస్సు సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరినీ నాశనం చేసింది. అని స్థానికులు నమ్ముతుంటారు.
పర్యాటకుల ఫేవరేట్ ప్లేస్.. భయానక నేపథ్యం ఉన్నప్పటికీ, రూప్కుండ్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ ట్రెక్కింగ్ పాయింట్లలో ఒకటి. సాధారణంగా 6 నుండి 8 రోజులు పట్టే ఈ ట్రెక్కింగ్, సాహసాన్ని ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ప్రయాణంలో అత్యంత సుందరమైన ఘట్టం క్యాంపింగ్. పర్వతాల మధ్య, పచ్చటి మైదానాలలో ప్లాన్ చేసుకునే టెంట్ల నివాసం కొత్త అనుభూతినిస్తుంది. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది.
Recommended for you
Found this helpful?
Share this story with your network








