
IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభమవుంది. దీంతో 2024లో జరిగిన చారిత్రాత్మక పోరు మళ్లీ వార్తల్లో నిలిచింది. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు సాధించినా మ్యాచ్ టై కావడం, రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ తర్వాత టీమిండియా విజయం సాధించడం అభిమానుల మదిలో నేటికీ నిలిచిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆ పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది. ఆరంభంలోనే ఆఫ్ఘన్ బౌలర్లు విరుచుకుపడటంతో యశస్వి జైస్వాల్ 4 పరుగులు, విరాట్ కోహ్లీ సున్నా, శివం దూబే ఒక పరుగు, సంజూ శామ్సన్ డకౌట్ రూపంలో నిష్క్రమించారు. కేవలం 22 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఆ దశలో అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం రింకూ సింగ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్కు భారీగా పరుగులు సాధిస్తూ ఏకంగా 190 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులు చేయగా, రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.





