
Increasing Your Creditcard Limit Is Risk And Reward
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది తమ ఖర్చులకు క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు (Credit limit increases). వీటికి నగదు పరిమితి ఉంటుంది. బ్యాంకులు కార్డు లిమిట్‌ను పెంచుకునేందుకు అప్పుడప్పుడూ ఆప్షన్ ఇస్తుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది తమ ఖర్చులకు క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు (Credit limit increases). వీటికి నగదు పరిమితి ఉంటుంది. బ్యాంకులు కార్డు లిమిట్‌ను పెంచుకునేందుకు అప్పుడప్పుడూ ఆప్షన్ ఇస్తుంటాయి. క్రెడిట్ పరిమితిని పెంచుకోవడం ద్వారా ఖర్చులు పెరిగిన సందర్భంలో మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (CUR) నిర్దిష్ట పరిమితిలోపే కొనసాగించేందుకు వీలవుతుంది. అలాగని, లిమిట్ పెంచడం వల్ల రిస్కూ లేకపోలేదు. అదేమిటో చూద్దాం..
క్రెడిట్ స్కోర్ విషయంలో ప్రధాన పాత్ర పోషించేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR). అంటే క్రెడిట్ కార్డు లిమిట్లో ఎంత శాతం వాడుకున్నామో దాన్నే సీయూఆర్ అంటారు. ఇది 30 శాతం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ.లక్ష అయితే.. నెలకు రూ.30 వేలు వాడినట్లయితే మీ యుటిలైజేషన్ రేషియో 30 శాతం అన్నమాట. ఒకవేళ మీ బ్యాంకు ఆ లిమిట్‌ను రూ.2 లక్షలకు పెంచితే.. మీరు అదే రూ.30 వేలు వాడినప్పుడు సీయూఆర్ 15 శాతానికి తగ్గుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి దోహదపడుతుంది. దీని వల్ల హోమ్‌లోన్ లేదా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ స్కోరు ఉపయోగపడుతంది.
లిమిట్ పెరిగితే క్రెడిట్ స్కోర్‌కు ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రమాదమూ ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే ఖర్చు చేసే వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. మితిమీరి ఖర్చు చేయడంతో క్రెడిట్ బిల్లు తడిసి మోపెడవుతుంది. సకాలంలో చెల్లించకపోతే బకాయిలు పెరిగిపోతాయి. దీనికి బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. స్థాయికి మించి ఖర్చు చేసినప్పుడు పేమెంట్లు మిస్ అయ్యి క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి కారణం అవుతుంది. స్కోరు పెరగాల్సిన చోట మొదటికే మోసం వస్తుందన్నమాట.
మీరు సమయానికి బిల్లులు చెల్లించే వారైతే, బకాయిలు లేకపోయినట్లయితే లిమిట్‌ను పెంచుకోవచ్చు. ఆ మేర క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను తగ్గించుకోవడంతో పాటు అత్యవసర సమయాల్లోనూ పెరిగిన మొత్తం ఉపయోగపడుతుంది. తరచుగా కనీస పేమెంట్ (మినిమమ్ బిల్లు) చెల్లించేవారైతే లిమిట్ పెంపు జోలికెళ్లకపోవడం మంచిది. పెంపును అంగీకరించే ముందు మీ చెల్లింపు అలవాట్లను సరిచూసుకోవాలి. సకాలంలో చెల్లించేందుకు ఆటో డెబిట్ ఆప్షన్ సెట్ చేసుకోవాలి. ఆ సమయానికి సరిపడా నగదు ఉండేలా చూసుకోవాలి. ఖర్చులను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి పరిమితి పెంచుకోవడం రివార్డా, రిస్కా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






