
బ్యాంకు రుణాలిప్పిస్తామంటూ మాయగాళ్ల బురిడీ ఈనాడు, హైదరాబాద్ : మహానగరంలో సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆవకాశం చేసుకొని మాయగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు, వడ్డీ వ్యాపారుల నుంచి రుణం ఇప్పిస్తామంటూ ఆర్థిక, సైబర్ నేరస్థులు మోసాలకు తెగబడుతున్నారు. నకిలీ కన్సల్టెన్సీలు, దళారులు ఆస్తిపత్రాలు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. భారీఎత్తున రుణం తీసుకొని ముఖం చాటేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నకిలీ కన్సల్టెన్సీలు, దళారులను నమ్మి ఆస్తిపత్రాలు అప్పగించొద్దని సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ సూచించారు. యుగంధర్ అనే వ్యక్తి ఏపీ, తెలంగాణల్లో బ్యాంకు రుణాలిప్పిస్తానంటూ 20 మందిని మోసగించినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవటం, సిబిల్‌స్కోర్ తక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువమంది రుణాల కోసం కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నారు. కొందరు నిర్వాహకులు సామాన్యుల ఇబ్బందులను తమకు అనువుగా మలచుకుంటున్నారు. రుణం రావటం కష్టమని మాయమాటలు చెప్పి వారిఇల్లు, ఖాళీస్థలాలు, భూములను తమ ఏజెంట్లు, అనుచరులపేరిట సేల్‌డీడ్ చేయిస్తున్నారు. బ్యాంకు రుణం తీర్చాక ఆస్తిపత్రాలు ఇస్తామని నమ్మిస్తున్నారు. భారీమొత్తంలో రుణాలు పొంది కొంత సొమ్ము అసలు యజమానులకు ఇస్తున్నారు. తీసుకున్న సొమ్ము పూర్తిగా చెల్లించినా, బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నుంచి నోటీసులు వచ్చిన సందర్భాల్లో మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారని సీసీఎస్ ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. కమీషన్‌కు ఆశపడే బ్యాంకు ఉద్యోగులు ఏజెంట్లుగా మారుతున్నారు. బ్యాంకులు తిరస్కరించిన వారిని కన్సల్టెన్సీలు, దళారుల వద్దకు పంపుతున్నారు. వారి ద్వారా దరఖాస్తు చేస్తే తేలికగా రుణాలు వస్తాయని ఆశచూపుతున్నారు. రూ.10లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు తక్కువ వడ్డీతో రుణాలు. కఠిన నిబంధనలు, పత్రాలతో పనిలేకుండా క్షణాల్లో మీ ఖాతాలో డబ్బులు జమచేస్తామంటూ సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్సైట్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల పేరిట ప్రకటన కనిపించగానే అధికశాతం ఆకర్షితులవుతున్నారు. రుణం మంజూరు కావాలంటే బీమా పాలసీ తీసుకోవాలని షరతు విధిస్తున్నారు