
సౌదీ అరేబియాపై దాడులతో కలకలం ఎర్రసముద్రంపై పట్టుతో ఆందోళన నేషనల్‌ డెస్క్‌: యెమెన్‌ కేంద్రంగా ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న హూతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు, ఎర్ర సముద్రంపై ఆధిపత్యం సాధిస్తున్న తీరు పశ్చిమాసియా సంక్షోభంలో కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. పవిత్ర నగరమైన మక్కాపై దాడికి ప్రయత్నించారంటూ సౌదీ అరేబియా చేసిన ఆరోపణలతో ఈ సంక్షోభం మరో మలుపు తిరిగినట్లయింది. హూతీలు మక్కా నగరానికి దక్షిణాన ప్రయోగించిన డ్రోన్లను తాము నిర్వీర్యం చేశామని సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. ఈ నగరానికి వచ్చే యాత్రికులు తమకు అత్యంత ప్రధానమని, తిరుగుబాటుదారులు ఈ ‘ఎర్ర గీత’ను దాటకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. మరోవైపు హూతీలు ఉత్తర సౌదీ అరేబియాలోని అల్‌ జౌఫ్‌లో తాము ధ్వంసం చేసిన సైనిక వాహనాల చిత్రాలను విడుదల చేశారు. మక్కాపై తాము దాడికి ప్రయత్నించినట్లు సౌదీ ప్రభుత్వం కట్టుకథలు అల్లుతోందని, అసత్య ప్రచారానికి పాల్పడుతోందని హూతీలు పేర్కొంటున్నారు. ‘ విభేదాలెందుకు?: 2014లో హూతీ తిరుగుబాటుదారులు యెమెన్‌ రాజధాని సనా నగరాన్ని వశపరచుకున్నారు. సౌదీ అరేబియా ఈ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకుంటూ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉన్న యెమెన్‌ ప్రభుత్వానికి మద్దతు పలికింది. దీంతో హూతీలకూ, సౌదీ అరేబియా మద్దతు కలిగిన ప్రభుత్వ బలగాలకూ మధ్య భీకర యుద్ధం సాగింది. ఐరాస చొరవతో 2022లో యుద్ధం నిలిచిపోయినా ఇరు పక్షాల మధ్య రాజకీయ ఒప్పందమేదీ కుదరలేదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించాక తొలుత హూతీలు మౌనంగానే ఉన్నారు. అయితే సౌదీ అరేబియా నౌకలు ఎర్ర సముద్రంలో సంచరించకుండా నిషేధం విధిస్తున్నట్లు జులై నెలలో హూతీలు ప్రకటించడంతో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. యెమెన్‌ రేవుల్ని సౌదీ అరేబియా దిగ్బంధించినందుకు నిరసనగా ఈ చర్య చేపట్టినట్లు హూతీలు వెల్లడించారు. యెమెన్‌ రేవుల దిగ్బంధనాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయాలని హూతీలు కోరుకుంటున్నారు. అలా చేయడం పరాజయాన్ని అంగీకరించినట్లే అవుతుందని సౌదీ భావిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





