
ఇందులో సగానికి పైగా 2025 నుంచే ట్రాక్సన్‌ నివేదిక దిల్లీ: భారత సెమీకండక్టర్‌ రంగంలోకి అంతర్జాతీయ, దేశీయ ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మన సెమీకండక్టర్‌ రంగంలోకి ఇప్పటివరకు మొత్తం 1.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.13,300 కోట్ల) ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ట్రాక్సన్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో దాదాపు సగం మొత్తం అంటే 701 మిలియన్‌ డాలర్లు, 2025 తర్వాత నుంచే వచ్చాయి. మొత్తం 3,557 సెమీకండక్టర్‌ కంపెనీలు: ప్రస్తుతం మన దేశంలో మొత్తం 3,557 సెమీకండక్టర్‌ రంగ కంపెనీలు ఉండగా, 281 సంస్థలు నిధులు సమీకరించాయి. అందులో 142 కంపెనీలు ఈక్విటీ ఫండింగ్‌ పొందాయి. 2026లో ఇప్పటివరకు ఈ రంగానికి 228 మి.డాలర్ల నిధులు వచ్చాయి. 2021లో కేవలం 49 మి.డాలర్లుగా ఉన్న వార్షిక ఫండింగ్, 2025 నాటికి 473 మి.డాలర్లకు పెరిగింది. గత 5 ఏళ్లలో నిధుల సమీకరణ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 36 శాతానికి పైగా నమోదైంది. అత్యధికంగా సమీకరించిన సంస్థల్లో టెసోల్వ్‌ సెమీకండక్టర్‌ (213 మి.డాలర్లు), ఇల్జిన్‌ ఎలక్ట్రానిక్స్‌ (198 బి.డాలర్లు), వీవీడీఎన్‌ (129 మి.డాలర్లు) ఉన్నాయి. 2025 నుంచి ఎలక్ట్రానిక్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ విభాగం అత్యధికంగా 313 మి.డాలర్లను సమీకరించగా, ఎంబెడెడ్‌ హార్డ్‌వేర్‌ విభాగం 51.9 మి.డాలర్లను పొందింది. ఫ్యాబ్‌లెస్‌ సెమీకండక్టర్స్, పవర్‌ మేనేజ్‌మెంట్‌ ఐసీలకు కూడా బలమైన పెట్టుబడులు లభించాయి. 17 నుంచి సెమీకాన్‌ ఇండియా 2026: ఈ నెల 17-19 తేదీల్లో దిల్లీ ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో సెమీకాన్‌ ఇండియా 5వ ఎడిషన్‌ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ సెమీకండక్టర్‌ రంగ ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. దేశంలోని మొత్తం సెమీకండక్టర్‌ సంస్థల్లో 18% (626 కంపెనీలు) బెంగళూరులో ఉన్నాయి. ఇప్పటివరకు దేశం మొత్తం సాధించిన ఈక్విటీ ఫండింగ్‌లో 40.1% వాటా ఒక్క బెంగళూరుకే దక్కింది. తర్వాతి స్థానాల్లో నోయిడా (16.4%), గురుగ్రామ్‌ (10.7%), కోచి (8.8%), హైదరాబాద్‌ (6.2%) ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




