
వేగంగా, సులభంగా తినగలిగే వాటి వైపు మొగ్గు నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఉదయం పూట ప్రశాంతంగా కూర్చుని తినే సంప్రదాయ అల్పాహారాల స్థానంలో.. పనికి వెళ్తూనే వేగంగా, సులభంగా తినగలిగే ఆహార సంస్కృతి ఊపందుకుంటోంది. ఈ మార్పు ఆధారంగా నగరాల్లో పలు క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు భిన్న అల్పాహారాలను అందిస్తున్నాయి. ఈనాడు, హైదరాబాద్‌: రుచిగా ఉండాలి.. అవసరమైన శక్తిని ఇవ్వాలి.. ఒంటికి పోషకాలు అందాలి.. తినేటప్పుడు చేతికి అంటకూడదు.. ఇతర ఆహార పదార్థాలు, పానీయాలతో సులభంగా జతకట్టేలా ఉండాలి.. ఇలాంటి మెనూనే నేటితరం కోరుకుంటోంది. కొందరు వీటిని ఉదయం పూట తింటుంటే.. జెన్‌ జీ ఎక్కువగా మధ్యాహ్నం ఆరగిస్తున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా శాండ్‌విచ్, పిజ్జా, బర్గర్‌తో పాటూ మరెన్నో కొత్త రుచులు మార్కెట్లోకి వచ్చాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు తోడు స్థానిక సంస్థలు ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. ఎగ్‌ మఫిన్‌ కప్స్‌: గుడ్ల సొనలో పాలకూర, క్యాప్సికమ్, ఉల్లిపాయలు కలిపి మఫిన్‌ ట్రేలో పెట్టి ఉడికిస్తారు. రెండు మఫిన్లు తింటే సరిపోతుంది. ఒక్కోదాంట్లో 50 నుంచి 130 క్యాలరీల వరకు ఉంటాయి. బ్యాగెల్‌: ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన అల్పాహారంలో బ్యాగల్‌ ఒకటి. మధ్యలో రంధ్రం ఉండే రింగ్‌ ఆకారపు రొట్టె. గోధుమలతో చేస్తారు. పైన నువ్వులు, లోపల చీజ్‌క్రీమ్‌తో తయారు చేస్తారు. ఇందులో 250 క్యాలరీలు, 49 గ్రాముల పిండిపదార్థాలు, 12 గ్రాముల ప్రొటీన్, 7 గ్రాముల పీచు ఉంటుంది. బెసన్‌ చిల్లా ర్యావ్‌: నానబెట్టిన పెసర్లు, శనగపిండితో వేసిన అట్టు లోపల పన్నీర్, కూరగాయల ముక్కలను పెట్టి రోల్‌లా చుట్టి తింటారు. సంప్రదాయ రుచితో పాటు వృక్ష సంబంధిత ప్రొటీన్‌ లభిస్తుంది. సులభంగా తినేయవచ్చు. ఒక అట్టులో 162 క్యాలరీలు, 21గ్రా పిండిపదార్థాలు ఉంటాయి. షవర్మా: పశ్చిమాసియా దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం మన నగరాల్లోకీ వచ్చేసింది. తిరుగుతున్న నిలువు కబాబ్‌ కర్రపై మాంసం పొరలను పేర్చి, ఉడికిన పొరలను కోసి, రొట్టెలో చుట్టి సాస్‌తో కలిపి ఇస్తారు. టమాటాలు, దోసకాయల వంటి కూరగాయలను సైతం కలుపుతారు. 450 నుంచి 550 క్యాలరీలు, 30 నుంచి 35 గ్రాముల ప్రొటీన్, 45 గ్రాముల పిండిపదార్థాలు, 15 నుంచి 20 గ్రాముల కొవ్వు ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం పూట మనవాళ్లు ఎక్కువగా వీటిని ఆరగిస్తున్నారు. సంప్రదాయ టిఫిన్ల స్థానంలో.. మనకు టిఫిన్లు అనగానే ఉదయం పూట ఇడ్లీ, దోశ, పూరి వంటివి గుర్తుకొస్తాయి. ఉరుకులు పరుగుల నగర జీవనంలో న్యూఏజ్‌ మార్నింగ్‌ ఫ్యూయల్‌గా.. వేగంగా తినే ఆహార పదార్థాల వైపు నగర వాసులు చూస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది బాగా పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడుతూ స్థానిక సంస్థలు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయి గట్టు శరత్‌చంద్రారెడ్డి (బ్యాగెల్‌ బ్రిగేడ్‌ సహా వ్యవస్థాపకులు) .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


