ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్న విషయాన్ని లోక్ భవన్ అధికారులకు కూడా తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాజమహేంద్రవరంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు, చేతి వృత్తి కళాకారులు రూపొందించిన పలు కళాఖండాలను సతీమణితో కలిసి పరిశీలించారు. కొన్నింటిని కొనుగోలు చేసి కళాకారులను అభినందించారు. అయితే క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు జ్వరం తీవ్రమైనట్లు సమాచారం. దీంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నట్లు తెలిసింది. అనంతరం రాజమహేంద్రవరంలోని డాక్టర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరీక్షించారు. కొద్దిసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.మరోవైపుపవన్ కళ్యాణ్ రొటేటర్ కఫ్ గాయానికి వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందని.. అప్పటి వరకూ ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఇటీవలే తిరిగి అధికారిక కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జ్వరం రావటంతో సర్జరీ అనంతరం చేయించుకోవాల్సిన ఫిజియో థెరపీ గురించీ వైద్య నిపుణుల సూచనలను పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు ప్రకటనలో తెలిపాయి.





