
గుంటూరు రూరల్: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన వైకాపా నాయకుడు కంకర నరేంద్రరెడ్డిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలో జనసేన నేతను హత్య చేసేందుకు నరేంద్రరెడ్డి తన అనుచరులతో కలిసి కుట్రపన్నారని పేర్కొన్నారు. 2024లో బాణసంచా కాల్చే విషయంలో నరేంద్రరెడ్డికి సమీపంలో ఉన్న వారితో గొడవ జరిగింది. ఆ విషయంలో జనసేన నేత కుమారుడు బాధితులకు మద్దతుగా నిలిచాడు. దీంతో అతడిపై నరేంద్రరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. దాడిలో గాయపడిన బోనబోయిన కౌశిక్ యాదవ్ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అదే సమయంలో నరేంద్రరెడ్డికి సంబంధించిన బార్‌ను నగరపాలక సంస్థ అధికారులు అనుమతులు లేవని కూల్చివేశారు. ఇది మనసులో పెట్టుకున్న నరేంద్రరెడ్డి తన అనుచరులతో కలిసి శ్రీనివాస్ యాదవ్‌ను హతమార్చేందుకు వెంకటేష్ అనే యువకుడి సాయంతో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడుకున్నారు. ముఠాలోని ఒకరైన వంశీకృష్ణ.. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌కు సమాచారం ఇచ్చాడు. గతంలో ఒకసారి హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన శ్రీనివాస్ యాదవ్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని.. ఇప్పటికే రెండుసార్లు రెక్కీ నిర్వహించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత నెల 14న కేసు నమోదు చేశారు. నరేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పరారయ్యాడు. 16 రోజులుగా పోలీసుల కళ్లు కప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడి కదలికలు గుర్తించి పెదపలకలూరు రోడ్డులో అరెస్ట్ చేసి 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు చేధనలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు. ఎస్సై సురేష్, సిబ్బంది పాల్గొన్నారు