
ఉద్యోగి అంటే కేవలం సంస్థలో పనిచేసే వ్యక్తి కాదు.. కష్టకాలంలో కంపెనీ అండగా నిలిచే మనిషి కూడా. ఈ విషయాన్ని ఓ సంస్థ ఆచరణలో చూపించింది. తండ్రిని కోల్పోయిన ఉద్యోగినికి కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ నాలుగు వారాలకు పైగా సెలవు ఇచ్చింది. అంతేకాదు.. తండ్రి చికిత్సకు అయిన ఖర్చుల్లో 20 శాతం భరించింది. సంస్థ ఛైర్మన్ స్వయంగా ఫోన్ చేసి ఆమె పరిస్థితిని తెలుసుకున్నారు.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విబిన్ బాబూరంజన్ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. కోయంబత్తూరులో 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సంప్రదాయ సంస్థలో తన సోదరి పనిచేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో తండ్రి చికిత్స పొందుతున్న సమయంలో సంస్థ వైద్య ఖర్చుల్లో 20 శాతం చెల్లించిందన్నారు. తండ్రి మృతి తర్వాత ఆమె కోలుకునేందుకు నాలుగు వారాలకు మించి సెలవు ఇచ్చిందని చెప్పారు.సంస్థలో 4,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని విబిన్ తెలిపారు. 40కి పైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని పేర్కొన్నారు. సంస్థ పేరు మాత్రం వెల్లడించలేదు.తండ్రిని కోల్పోయిన వారం రోజుల్లోనే సంస్థ తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇలాంటి సంస్థల వల్లే గతంలో ఉద్యోగులు తమ సంస్థలతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు.ఈ పోస్టుకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది. కష్ట సమయంలో ఉద్యోగికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. కుటుంబ యాజమాన్యంలోని సంస్థల్లో ఉద్యోగుల పట్ల మానవీయత ఎక్కువగా కనిపిస్తుందంటూ కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు.





