Aug 13 2026 12:23 PM | Updated on Aug 13 2026 12:31 PM
సాక్షి, అమరావతి: అమరావతి కార్యక్రమాలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలనే దూరంగా ఉన్నారంటూ అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదీ షెడ్యూల్లో హడావిడిగా చేర్చుకుని మరీ.. ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే!.
నారాయణ రాయబారం విఫలం! పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్‌తో నారాయణ భేటీ అయినట్లు సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ.. చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ సాగుతోంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
చంద్రబాబుపై తగ్గిన పవన్ స్పందనలు గత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపై పవన్ కల్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్.. ఈ మధ్యకాలంలో అలాంటి స్టేట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారా? అని చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యేల క్వార్టర్ల అంశమే కారణమా? పవన్ కల్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండటానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిర్మాణ వ్యయాల పెంపు, అంచనాల మార్పులపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఖర్చుల విషయంలో మరింత పారదర్శకత అవసరమని పవన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై పవన్ గతంలోనూ అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అనే దానిపై జనసేన స్పందించాల్సి ఉంది.
వరుస గైర్హాజరులతో పెరుగుతున్న చర్చ ఇటీవల జరిగిన కొన్ని కీలక సమావేశాలకు కూడా పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పలు కేబినెట్ సమావేశాలకు(మూడు సార్లు) ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఈమధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరైన భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యక్రమానికి మాత్రం పవన్ హాజరయ్యారు. ఆ వేదికపై కూడా చంద్రబాబు కంటే ప్రధాని మోదీనే ప్రసన్నం చేసుకునేందుకు పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారన్న రాజకీయ వ్యాఖ్యలు వినిపించాయి.
నాదెండ్ల ప్రకటనతో మరింత ఆసక్తి మరోవైపు పవన్ గైర్హాజరుపై టీడీపీ–జనసేన కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి విభేదాలను ప్రస్తావించకపోయినా.. ఈ పరిణామాలపై మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కార్యక్రమానికి పవన్ దూరంగా ఉండగా.. జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో అమరావతిపై ఒక మొక్కుబడి ప్రకటన ఇప్పించడం కూడా చర్చకు దారితీసింది.
అసలు పవన్ దూరం వెనుక కారణం ఏమిటి? నిజంగానే కూటమిలోని కొన్ని అంశాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు)
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
స్టాక్ లోకి లలితా జువెల్లరీ IPO.. ఒక్కో షేరు ఎంతో తెలుసా?
జగన్ సార్ ఉన్నంతవరకు మాకు ఎలాంటి భయం లేదు.. విరూపాక్షి భార్య కామెంట్స్
ఇప్పుడు జగనన్నను కలిసి ఒకే ఒక్క మాట చెప్పాలి
వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో డ్రోన్లు హల్ చల్