
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు, విజయవాడ-మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన నూతన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి వద్ద ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం, అనంతరం స్వయంగా కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలు, రహదారి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రైతులు, స్థానికులను ఉద్దేశించి ఆయన అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన అన్నదాతలు చేసింది కేవలం భూత్యాగం మాత్రమే కాదని, రాబోయే తరాలకు, ప్రపంచానికే ఆలోచింపజేసే ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాజధాని నిర్మాణంలో రైతులను నేరుగా భాగస్వాములను చేయాలనే మహోన్నత ఆలోచనతోనే తాము ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వంపై ఉంచిన నమ్మకంతో నోటిఫికేషన్ ఇచ్చిన కేవలం 58 రోజుల్లోనే 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉదారత చూడలేమని చెబుతూ అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను స్మరించుకుంటూ, నాడు మనకు రాజధాని ఎక్కడ నిర్మించాలో, ఎటు వెళ్లాలో తెలియని గందరగోళం నెలకొందని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు, మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. నాడు ఏమీ లేని శూన్యం నుంచి నేడు ప్రపంచం గర్వించే రీతిలో స్వయంగా రాజధానిని నిర్మించుకునే స్థాయికి చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని ప్రస్తావిస్తూ... నాడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మిస్తుంటే చాలామంది హేళనగా మాట్లాడి ఎగతాళి చేశారని