
పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి గల్లంతు కాగా.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇరగవరం మండలంలోని అయితంపూడి లాకుల సమీపంలో ఆదివారం రోజు ఉదయం ఓ కారు అదుపు తప్పి.. నరసాపురం పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన ఐదుమంది విద్యార్థులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ నలుగురి మృతదేహాలు లభ్యంకాగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాద ఘటనలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మోరి గ్రామానికి చెందిన లక్ష్మీభానువికాస్, దుష్యంత్ సాయి, రాజారాం చరణ్ అనే ముగ్గురితో పాటు.. అమలాపురంలోని చాకూరుకి చెందిన సాయిసూర్యతేజ, పశ్చిమ గోదావరి జిల్లా చింతపర్రుకి చెందిన సాయి వెంకటకిరణ్ గల్లంతయ్యారు. వల్లూరుకి చెందిన సంతోష్ అనే యువకుడు ప్రాణాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.ఈ యువకులు అందరూ పెరవలిలోని ఓ పెళ్లివేడుకకు హాజరై.. తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పెరవలి నుంచి నరసాపురం తిరిగి వెళ్తూ మధ్యలో ఓ స్నేహితుణ్ని కలిశారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న సమయంలో అయితంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. వర్షం పడుతుండటంతో ఎదురుగా ఉన్న కాలువను గమనించక, యువకులు ఉన్న కారు నేరుగా పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే ప్రమాద సమయంలో పంట కాలువలోని నీరు ఎక్కువ ఉద్ధృతితో ప్రవహిస్తూ ఉండటంతో కారు 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. ఆ సమయంలోనే సంతోష్ అనే యువకుడు చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడ్డాడు.మిగతా యువకులు గల్లంతు కాగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన రాజారాం చరణ్ అనే యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన యువకుడు మినహా మిగతా అందరూ నరసాపురంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. ఈ ఘటనతో యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.





