
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారులను ఆకర్షించేందుకు గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఇస్తుంటారు. 5స్టార్ రేటింగ్ ఉన్న వాటిని కూడా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. ఇటువంటివి కొనకపోవడమే మంచిది. ఎందుకంటే దానిపై ఉన్న లేబుల్‌లో ఉన్న 5 స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా వాటి పనితీరు ఉండదు. సాధారణంగా రెండేళ్లకోసారి స్టార్ రేటింగ్ ప్రమాణాలు మారిపోతాయి. అంటే పరికరం పనితీరు తగ్గడం కాదు. కొత్త సాంకేతికతతో పోలిస్తే దాని విద్యుత్తు పొదుపు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది తెలియక 5 స్టార్ రేటింగ్ లేబుల్ ఉందని వాటిని కొంటే మోసపోయినట్లే. గృహోపకరణాలను తయారు చేసే సంస్థలు ఎప్పటికప్పుడు సాంకేతికతను పెంచుకుంటాయి. దీనివల్ల కొత్తగా తయారు చేసే ఉత్పత్తుల ఎఫిషియన్సీ లెవెల్ (ఈఎల్) ఎక్కువగా ఉంటుంది. అదే గృహోపకరణం స్థాయి లెక్కింపును బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రెండేళ్లకు మార్చేస్తుంది. అప్పటి లెక్కల ఆధారంగా స్టార్ రేటింగ్ నిర్ణయిస్తుంది. దీంతో ప్రస్తుత ప్రమాణాలతో పోలిస్తే.. రెండేళ్ల కిందట తయారైన ఉత్పత్తుల ఈఎల్ తక్కువగా ఉంటుంది. రెండేళ్ల క్రితం 5స్టార్ రేటింగ్ ఉన్నది. ఇప్పుడు 3, 4స్టార్ రేటింగ్‌కు పడిపోవచ్చు. అందుకే పాత తేదీల్లో లేబుల్ ఉన్నవాటిని కొంటే నష్టపోతాం. ఒక పరికరం విద్యుత్‌ను ఉపయోగించుకుని ఇచ్చే ఫలితం ఆధారంగా(ఎనర్జీ ఎఫిషియన్సీ)రేటింగ్‌ను బీఈఈ నిర్ణయిస్తుంది. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి వాటికి రేటింగ్ నిర్ణయించే విషయంలో విభిన్న ప్రమాణాలను పాటిస్తుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు