అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేస్తారట. నియోజకవర్గంలో పని చేయాలంటే ఎమ్మెల్యే కాదు వాళ్ళ అబ్బాయి దయ కావాలని సిబ్బంది చెవులు కోరుకుంటున్నట్లు టాక్.
ఇక ఎమ్మెల్యే మేనల్లుడు మద్యం షాపులు, బార్లు, రియల్ ఎస్టేట్ అన్ని ఆయనే చూస్తారట. ప్రతినెల మద్యం షాపుల నుంచి మామూళ్ళు ఇవ్వకపోతే ఆ షాపు పై ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తారట. గతంలో ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జనసేన నేతకు చెందిన ఓ మద్యం షాపు యజమాని డబ్బులు ఇవ్వలేదని దాడులు చేయించారు. షాపు మూయించాలని ఆదేశాలు ఇచ్చారని ఇప్పటికి ప్రచారం ఉంది. నాలుగు రోజులు నానా ఇబ్బంది పెట్టిన తర్వాత వారు ముడుపులు చెల్లించారని అనంతరం ఇది సెటిల్ అయిందని చెప్పుకుంటారు. పలు బ్రాందీ షాపులలో ఆయనకు వాటాలు ఉన్నాయని ,వాటా అంటే పెట్టుబడి పెట్టింది కాదు. ఎమ్మెల్యే పేరు చెప్పి గుడ్ విల్ కింద మరీ తీసుకున్నారట. అలాగే ఓ బార్ పై ఎమ్మెల్యే గారి మేనల్లుడు చేసిన దాడి వేధింపులు తట్టుకోలేక చివరికి అధికారులు ఆ బార్ పై కేసు పెట్టి సీజ్ చేశారని కూడా నియోజవర్గంలో ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు.. నియోజకవర్గంలో ఎవరైనా లే అవుట్ వేస్తే చాలు అది లే అవుటా, నాన్ లే అవుటా అన్నది అనవసరమట. సామాజిక స్థలంలో కొంత ఆయనకు కేటాయించడంతోపాటు కనీసం 10 లక్షలు ఇవ్వాలని రియల్టర్లు కన్నీరు పెట్టుకుంటున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా పంట కాలువలు, డ్రైన్లు మూసివేసి పుట్టగొడుగుల్లా నాన్ లే అవుట్లు వెలిశాయని ప్రచారం సాగుతోంది. అటు ఎమ్మెల్యే గారి మేనల్లుడు వాటాలేనని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంగీకరిస్తున్నారు. స్థలం ఇవ్వాలి. మామూళ్లు ఇవ్వాలి. ఇవన్నీ తాము ఎక్కడి నుంచి తేవాలి. అందుకే ప్రభుత్వం స్థలం కలిపేసుకుంటున్నామని బహిరంగంగానే చెబుతున్నారట.
ఎమ్మెల్యే గారి కార్యక్రమాలకు ఏ మీడియా సంస్థను పిలవాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి, ఎవరికి సమాచారం దూరంగా ఉంచాలి. ఎవరికీ లీకులు ఇవ్వాలి .ఇవి అన్నీ కూడా మేనల్లుడు గారే చూసుకుంటున్నారట. ఇక సదరు ప్రజా ప్రతినిధి సోదరి మరో తరహాలో పెత్తనం చేస్తారని ప్రచారం సాగుతోంది. డీఆర్డీఏ, వెలుగు, ఐసీడీఎస్ విభాగాల్లో ఆమె చెప్పిందే చేయాలనే ఆదేశాలు ఉన్నాయట. ఉద్యోగులు ప్రతిరోజు వెళ్లి కలవాలట. అలాగే ఈ సంస్థలకు సంబంధించి భారీ ఎత్తున కాంట్రాక్టులు కూడా ఆమె చేస్తున్నారని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులు తప్పక ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే తమ ఉద్యోగాలు ఉండవని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే గారి మరో బావ కూడా నియోజవర్గంలో జరుగుతున్న పలు పనుల్లో వేలు పెడుతూ చిలకకొట్టుడు కొడతారని ఆ పార్టీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో ఈ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తోందని సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఈ వ్యవహారం కాస్తా అధినేత వరకు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో సదురు ఎమ్మెల్యేను పలు దఫాలు అధినేత పిలిచి మందలించారు. తీరు మార్చుకోవాలని అదేశించారు కూడా. ఇదే ఆఖరి ఛాన్స్. ఇక టికెట్ కూడా లేదని చెప్పేసారట. దీంతో ఎలాగూ టిక్కెట్ ఉండదు. పోటీ చేసేది ఉండదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎమ్మెల్యే గారు, కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని దున్నేస్తున్నారట.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందాన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబం ఇలా వ్యాపారాలు చేస్తే తామెందుకు ఊరుకోవాలని కేడర్ కూడా ఇదే తరహాలో పనిచేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరికి వారే మట్టి తవ్వకాలు, అమ్మకాలు, భూముల కబ్జాలు, మహిళలను వేధించడం వంటివి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఆ ఎమ్మెల్యే గారి పుణ్యమాని రెండేళ్లకే ఆ పార్టీపై ప్రజలకు మొహం మొత్తేసింది. ఇక తమకు మంచి రోజులేనని ఆ నియోజకవర్గ వైసిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదికలు ఇస్తూనే ఉన్నారట. ఇప్పటికైనా అధినేత పిలిచి మందలిస్తారా.. టిక్కెట్ లేదని చెప్పేసారు కాబట్టి సైలెంట్ గా ఉంటారా.. ఈ వ్యాపారం ఇలాగే కొనసాగుతుందా.. ఇదీ ఒక్క ఆ నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఎమ్మెల్యేపై జరుగుతున్న చర్చ..