బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతక్కువ ధరకే సన్న బియ్యం అందిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజార్లు, రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా నాణ్యమైన సన్న బియ్యాన్ని , 10 కిలోల లెక్కన తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆగస్ట్ నెల మొదటి వారం నుంచి ఈ విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. అయితే బియ్యం కార్డు ఉన్నవారికిమాత్రమే సన్నబియ్యం విక్రయించాలని ఏపీ పౌరసరఫరాల శాఖ తొలుత నిర్ణయించింది. అయితే బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం బియ్యం కార్డుతో పనిలేకుండా ఆధార్ కార్డు ద్వారా అందరికీ సన్నబియ్యం విక్రయిస్తున్నారు.మరోవైపు బహిరంగ మార్కెట్లో నాణ్యమైన సన్నబియ్యం కిలో రూ.60 నుంచి రూ.65 వరకూ పలుకుతోంది. అయితే ఈ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ విక్రయ కేంద్రాల ద్వారా బీపీటీ(స్ట్రీమ్డ్) రైస్ కిలో రూ.52చొప్పున.. బీపీటీ ముడి(రా రైస్) బియ్యం రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కేంద్రాల ద్వారా వీటి అమ్మకాలు సాగుతున్నాయి. అయితే కొన్నిచోట్ల ఊహించినంత స్థాయిలో సన్నబియ్యం విక్రయాలు జరగడం లేదని తెలుస్తోంది.దీనికి సాంకేతి అంశాలే కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం విక్రయాల కోసం తొలుత రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ తరువాత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో.. ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేయటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆధార్ అథెంటిఫికేషన్ కోసం సర్వర్లు సరిగ్గా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే కుటుంబానికి 25 కిలోల బస్తా చొప్పున విక్రయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేదీ చూడాల్సి ఉంది