అవకాశముంది. కొత్త పోర్టులు, పారిశ్రామిక అనుసంధానాలు పూర్తయితే ఈ సామర్థ్యం మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే పోర్టుల అసలు ప్రభావం కార్గో గణాంకాల్లో కాదు... రైతు పండించిన పంట, మత్స్యకారుడు పట్టిన చేప, పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి... ఇవన్నీ ప్రపంచ మార్కెట్కు చేరే సమయాన్ని, వ్యయాన్ని తగ్గించడంలో ఉంది. అందుకే దక్షిణ కోస్తాలో పోర్టులు కేవలం సముద్ర వాణిజ్య కేంద్రాలు కావు... ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు వేగాన్ని ఇచ్చే బూస్టర్లు.ఎనర్జీ కారిడార్లు... దక్షిణ కోస్తా పారిశ్రామిక శక్తికి ఇంధనమా?వ్యవసాయం దక్షిణ కోస్తాకు ఆహార భద్రతను ఇచ్చింది. ఆక్వా ఎకానమీ విదేశీ మారకాన్ని తీసుకొచ్చింది. పోర్టులు ప్రపంచ మార్కెట్లకు ద్వారాలు తెరిచాయి. ఇప్పుడు ఈ మూడు బలాలను ఒకే ఆర్థిక వ్యవస్థగా అనుసంధానిస్తున్నది ఎనర్జీ మౌలిక సదుపాయాలు. అందుకే దక్షిణ కోస్తా అభివృద్ధి తదుపరి అధ్యాయం విద్యుత్, సహజవాయువు, పారిశ్రామిక ఇంధనంతో ముడిపడి ఉంది. ఈ ప్రాంతానికి అతిపెద్ద బలం కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్. భారతదేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఆఫ్షోర్ సహజవాయు క్షేత్రాల్లో ఇదొకటి. కాకినాడ తీరాన్ని కేంద్రంగా చేసుకుని సహజవాయువు ఉత్పత్తి, గ్యాస్ ప్రాసెసింగ్, పైప్లైన్ అనుసంధానం అభివృద్ధి చెందడంతో దక్షిణ కోస్తా క్రమంగా ఎనర్జీ హబ్ వైపు అడుగులు వేస్తోంది.కాకినాడ పరిసరాల్లోని గ్యాస్ మౌలిక సదుపాయాలు, గెయిల్ వంటి సంస్థల జాతీయ గ్యాస్ గ్రిడ్ అనుసంధానం, కృష్ణా–గోదావరి బేసిన్ నుంచి వెలువడుతున్న గ్యాస్ సరఫరా-ఇవన్నీ కలిపి ఎరువుల పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సిరామిక్స్, ఆహార ప్రాసెసింగ్, ఇతర తయారీ రంగాలకు ఇంధన భద్రతను అందించే పునాదిగా మారుతున్నాయి. అదే సమయంలో కృష్ణపట్నం ప్రాంతం కూడా విద్యుత్ ఉత్పత్తిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పోర్టు ఆధారిత బొగ్గు సరఫరా వ్యవస్థ, పారిశ్రామిక విద్యుత్ మౌలిక సదుపాయాలు దక్షిణ ఆంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి బలాన్ని ఇస్తున్నాయి.వ్యవసాయం నుంచి శక్తి ఆధారితంగా రూపాంతరంఇంధనం అనేది కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాదు. గ్యాస్, విద్యుత్, పోర్టు, రహదారి, పారిశ్రామిక పార్కులు... ఈ ఐదు ఒకేచోట కలిసినప్పుడే పెట్టుబడిదారులు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారు. ఈ దృష్టితో చూస్తే దక్షిణ కోస్తా క్రమంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి శక్తి ఆధారిత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మార్పు పూర్తి ఫలితాలను ఇవ్వాలంటే ఒకే ఒక్క షరతు ఉంది. ఎనర్జీ కారిడార్లు పరిశ్రమలకు మాత్రమే కాకుండా స్థానిక ఉపాధికి, విలువ ఆధారిత తయారీకి, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు కూడా అనుసంధానం కావాలి. అప్పుడు మాత్రమే ఈ మౌలిక సదుపాయాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలవు. అందుకే దక్షిణ కోస్తాలో ఎనర్జీ కారిడార్లు కేవలం గ్యాస్ పైప్లైన్లు లేదా విద్యుత్ కేంద్రాలు కావు... వ్యవసాయం, పోర్టులు, పరిశ్రమలను ఒకే ఆర్థిక గొలుసుగా కలిపే అభివృద్ధి శక్తి.ప్రకాశం... దక్షిణ కోస్తా అభివృద్ధి చిత్రపటంలోని భిన్నమైన అధ్యాయందక్షిణ కోస్తా అభివృద్ధి గురించి ఇప్పటివరకు చూసిన చిత్రంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి–కృష్ణా డెల్టాల సాగునీటి వ్యవస్థ, కాకినాడ–కృష్ణపట్నం పోర్టుల ఆర్థిక ప్రభావం, అమరావతి వంటి పరిపాలనా కేంద్రం, పారిశ్రామిక–సేవారంగ అవకాశాలు... ఇవన్నీ కలిసి ఈ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి నమూనాను రూపొందించాయి. అయితే ఇదే చిత్రపటంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒక భిన్నమైన ప్రశ్నగా నిలుస్తుంది. భౌగోళికంగా దక్షిణ కోస్తాలో భాగమే. సుదీర్ఘ సముద్రతీరం ఉంది. విస్తారమైన భూభాగం ఉంది. గ్రానైట్ వంటి ఖనిజ సంపద ఉంది. పొగాకు, పశుసంపద, వ్యవసాయ అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రామాయపట్నం పోర్టు వంటి కొత్త మౌలిక సదుపాయాల ప్రతిపాదనలు కూడా వచ్చాయి.అయితే, తూర్పు గోదావరి నుంచి నెల్లూరు వరకు కనిపించే అభివృద్ధి వేగం ప్రకాశం జిల్లాలో అదే స్థాయిలో ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నకు ఒకే కారణం చూపడం సాధ్యం కాదు. డెల్టా ప్రాంతాల మాదిరిగా విస్తృతమైన సాగునీటి వ్యవస్థ లేకపోవడం, వర్షాధార వ్యవసాయం అధికంగా ఉండడం, పారిశ్రామిక పెట్టుబడులు పరిమితంగా ఉండటం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆలస్యంగా సాగడం, ప్రాంతీయ పెట్టుబడి ఆకర్షణలో వెనుకబడటం... ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి దోహదపడ్డాయని అభివృద్ధి అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే ప్రకాశం జిల్లా కథ వనరుల లేమి కథ కాదు... వనరులను ఆర్థిక శక్తిగా మార్చడంలో ఎదురైన సవాళ్ల కథ. ఇప్పుడు పరిస్థితి మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక అవకాశాలు, జాతీయ రహదారి అనుసంధానం, కొత్త పెట్టుబడి విధానాలు ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలను తీసుకురాగలవు. అయితే వాటి ప్రభావం ప్రజల జీవన స్థాయిలో ఎంతవరకు ప్రతిఫలిస్తుంది అనేదే అసలు ప్రమాణం. అందుకే ఉమ్మడి ప్రకాశం జిల్లా దక్షిణ కోస్తా అభివృద్ధి కథలో మినహాయింపు కాదు. ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి ఎంతవరకు సాధ్యమైందో పరీక్షించే ప్రత్యక్ష ఉదాహరణ. వ్యవసాయం పంటను ఇస్తుంది. ఆక్వా రంగం విదేశీ మారకాన్ని తెస్తుంది. పోర్టులు ప్రపంచ మార్కెట్లను అనుసంధానిస్తాయి. ఎనర్జీ పరిశ్రమలకు శక్తిని అందిస్తుంది. వీటన్నింటి సమాహార రూపంలో పారిశ్రామికీకరణ కూడా పయనిస్తుందన్న విషయాన్ని తదుపరి కథనంలో చూద్దాం.పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో దక్షిణ కోస్తా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.Read Also: దక్షిణ కోస్తా డెవలప్మెంట్ ఆడిట్ పార్ట్-1Read Also: దక్షిణ కోస్తా డెవలప్మెంట్ ఆడిట్ పార్ట్-2Read Also: దక్షిణ కోస్తా డెవలప్మెంట్ ఆడిట్ పార్ట్-4Read Also: ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఆడిట్ కథనాలుగమనిక:‘సమయం’ పాఠకుల కోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆడిట్ పేరిట సరికొత్త సిరీస్ను ప్రారంభించాం. మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ చెన్ను పెద్దిరాజు సొంత అధ్యయనంతో, విశ్లేషణాత్మక కోణంలో అందించే ప్రత్యేక సిరీస్ ఇది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సమకాలీన అంశాలపై విభిన్న కోణాల్లో సాగే ఆయన వ్యక్తిగత విశ్లేషణలు, ఆలోచనలను యథాతథంగా పాఠకులకు అందిస్తున్నాం. ఆయన లోతైన అవగాహన, విశ్లేషణల సమాహారంగా సాగే ఈ కథనాలను పాఠకులకు సరికొత్త దృక్పథాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ కథనాల్లోని అభిప్రాయాలు జర్నలిస్ట్ వ్యక్తిగతమైనవి, ‘సమయం’కు సంబంధం లేదని గమనించగలరు