
Chiranjeevi
కొన్నాళ్ల క్రితం చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి దూరం పెరిగింది. అటు ఇటు రాకపోకలు తగ్గిపోయాయి. అల్లు అర్జున్ వెళ్లి వైకాపా అభ్యర్థికి ప్రచారం చెయ్యడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఐతే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక్కడ పుష్ప 2 సినిమా థియేటర్ తొక్కిసలాట కేసులో ఒకరోజు అల్లు అర్జున్ జైలులో ఉండి రావడంతో మళ్ళీ ఇరు కుటుంబాల మధ్య రిలేషన్స్ మెరుగు అయ్యాయి. ఐతే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. “మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మాకు ఎప్పుడూ గొప్ప అండగా నిలిచారు. మనలో ప్రతి ఒక్కరినీ ఆయన స్ఫూర్తిగా నిలిపి, ఎదిగేలా ప్రోత్సహించారు. #KKAVCF (Iykyk)” అంటూ బన్నీ మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే ఈ ట్వీట్లో బన్నీ ఉపయోగించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు అసలు అర్థం ఏమిటో అల్లు అర్జున్ వివరించలేదు. అయితే అల్లు అర్జున్ గతంలో చేసిన ఓ వ్యాఖ్యను బట్టి ఆ భావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సందర్భంలో బన్నీ మాట్లాడుతూ “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఇప్పుడు అదే మాటను గుర్తు చేసేలా #KKAVCF అనే హ్యాష్‌ట్యాగ్‌ను అల్లు అర్జున్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌కు పూర్తి అర్థాన్ని బన్నీ స్వయంగా వెల్లడించలేదు