అలాగే మారిపోవాలని కవ్వించేసరికి సరేనన్నాడు. అయితే అతడి ఆ ఫొటోలు, వీడియోలు రికార్డు చేసిన ఆమె.. మర్నాటి నుంచి అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది. వారం రోజుల్లో అతడి నుంచి రూ.లక్ష లాగేసుకుంది. జేబు ఖాళీ అవ్వడం, ఆ ఫొటోలు, వీడియోలను తన ఫోన్ కాంటాక్ట్స్‌లోని చాలామందికి ఆమె షేర్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో అతడు పోలీసులను ఆశ్రయించాడు. వారు ఊరుకుంటారా? ఆ మోసగత్తెను అరెస్టు చేసే ఉంటారు అని అనుకుంటున్నారు కదూ! లేదు.. ఎందుకంటే అసలు అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. ఆమె అమ్మాయి కాని అమ్మాయి! అంటే.. ఏఐ నెరజాణ అన్నట్టు! ఫోన్లో పరిచయమైంది మొదలు.. వీడియో కాల్స్‌లో మాట్లాడేదాకా బాధితుడికి ఏ దశలోనూ చిన్న అనుమానమైనా రాలేదు! యువకుల ఇదే బలహీనతను ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. ఏఐ అమ్మాయిలతో వలపువల విసిరి.. కమ్మని మాటలతో కవ్వించి ఉన్నదంతా దోచేస్తున్నారు. డేటింగ్ యాప్‌ల బారిన పడి రాష్ట్రంలో ఏడాదిలో 569 మంది మోసపోయారని.. వీరంతా కలిపి రూ.2.81 కోట్లు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ లెక్కలన్నీ ఫిర్యాదు చేసిన యువకలకు సంబంధించినవే! పరువుపోతుందని మౌనంగా ఉండిపోయిన బాధితులు ఎంతో మంది ఉంటారని పోలీసులు చెబుతున్నారు. డేటింగ్ యాప్‌లు.. అందులోని ఏఐ యువతుల మాయలో పడి మోసపోతున్నవారిలో 61శాతం 18-35 ఏళ్ల వారేనని పోలీసుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఆన్లైన్ కేటుగాళ్లు తమ రూటు మార్చారని.. అందమైన అమ్మాయిలను సృష్టించి.. యువకులను లక్ష్యంగా చేసుకొని వల విసురుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో పరిచయాలు చేసుకోవడం తప్పు కాదని, అయితే ఆ పరిచయమైన వ్యక్తిని పూర్తిగా నమ్మడమే ప్రమాదం అని చెబుతున్నారు. సాంకేతికత పెరగడంతో ఇప్పుడిలాంటి మోసాలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆన్లైన్లో యువతులు తామే చొరవ తీసుకొని మాట్లాడినా, కవ్విస్తూ రెచ్చగొట్టినా, ఫొటోలు పంపాలని ఒత్తిడి చేసినా, ఏదైనా లింక్ ఓపెన్ చేయాలని చెప్పినా.. న్యూడ్‌గా వీడియో చాటింగ్ చేద్దామని రెచ్చగొట్టినా అనుమానించాల్సిందేని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏఐతో సృష్టించే అమ్మాయిలను కాస్త పరిశీలనగా చూస్తే గుర్తుపట్టవచ్చునంటున్నారు నిపుణులు. ఏఐ అమ్మాయిల్లో శ్వాసకు అనుగుణంగా ఛాతీ, భుజాలు కదలకపోవడం, కంటి రెప్పల కదలికల్లో అసహజత్వం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ కవళికలు, పెదవుల కదలికలకు సరిగ్గా సింక్ కాకపోవడం, కళ్ల కదలికల్లో అసహజత్వం, వెలుతురు, నీడల్లో తేడాలు ఉంటే వెంటనే అనుమానించాలని సూచిస్తున్నారు. ఎలా గుర్తించవచ్చంటే... నిపుణులు ఇంకొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘మీతో వీడియో కాల్ మాట్లాడే వ్యక్తులకు తమ ముఖం ముందు చేతిని అడ్డంగా పెట్టి అటూ ఇటూ ఆడించమనండి. ఏఐ వీడియో అయితే ముఖం మీదకు చేయి రాగానే ముఖం బ్లర్‌గా మారుతుంది. అలాగే మీతో మాట్లాడే వ్యక్తులను ఓ పక్కకు తిరగమనండి. అలా చేసినప్పుడు వారి ముఖ డిజైన్ మారిపోతే అది ఏఐ వీడియోనే! మీ అనుమానం బలపడితే.. పక్కన ఉన్న వస్తువు ఏదైనా చేతుల్లోకి తీసుకొని చూపించమనండి. ఏఐ అయితే త్వరగా అలా చేయలేదు’’ అని చెబుతున్నారు. ఫొటోలు, వీడియోలు పంపడం ద్వారా సైబర్ వలలో చిక్కుకుపోయామని అనిపిస్తే అస్సలు భయపడకూడదు. వారు అడిగిన డబ్బిస్తే సమస్య పరిష్కారమవుతుందని అనుకోవొద్దు. వారితో చేసిన చాట్స్, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు., పేమెంట్స్ తాలూకు స్ర్కీన్‌షాట్స్, లింకులు వంటి ఆధారాలను డిలీట్ చేయకుండా భద్రపరుచుకోవాలి. వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐ భామల వలలో పడకుండా ఉండాలంటే తెలియని లింక్‌లను క్లిక్ చేయొద్దు. నెట్లో ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి యాప్ డౌన్లోడ్ చేయొద్దు. ఏపీకే ఫైల్స్ లేదంటే ఽథర్డ్ పార్టీ లింక్‌లకు దూరంగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులకు వీడియోలు, వ్యక్తిగత ఫొటోలు పంపకూడదు. వీడియో కాల్ పరిచయం ఉందని, ఓటీపీలు, యుపీఐ పిన్లు లాంటివి అసలు చెప్పకూడదు. ఈ వార్తలు కూడా చదవండి: క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. Read Latest AP News And Telangana News And International News And Telugu News