
కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన నటి ప్రేమ.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘దేవి’ చిత్రం కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. భక్తిరస కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమ పోషించిన దేవి పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విజయంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ధర్మచక్రం సినిమా, మోహన్‌బాబుతో రాయుడు, జగపతిబాబుతో చిలక్కొట్టుడులాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న ప్రేమ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై గతంలో వచ్చిన వార్తలపై స్పందించారు.





