టాలీవుడ్ హీరో తనీష్ అల్లాడి సినిమాలకు దూరమై చాలా ఏళ్లయింది. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ పార్టీ తరపున ప్రచారం చేసిన ఈ నటుడు..
ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తనీష్.. తాజాగా ఎక్స్ లో పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనీష్ కి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో ‘మేం వయసుకు వచ్చాం’ ఒకటి. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 2012లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. జూన్ 23వ తేదీకి ఈ మూవీ వచ్చి 14 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో “మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అంటూ తనీష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమా పోస్టర్ ను పంచుకున్నారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి జక్కిరెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త స్పందిస్తూ.. తనీష్ పై సెటైరికల్ కామెంట్స్ చేశాడు.“హాస్యాస్పదం ఏంటంటే, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ 10వ తరగతి ఫెయిల్ అయిన సినిమా యాక్టర్స్ కింద పనిచేస్తున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సినిమాలో అమ్మాయిలతో డ్యాన్సులు, ఏజ్ అయిపోయాక పాలిటిక్స్ అంటూ పబ్లిక్ తో డ్యాన్సులు చేపిస్తారు. థ్యాంక్ గాడ్. తెలంగాణ ప్రజలు వివేకవంతులు, వారు ఆడంబరాలకు పడిపోరు కానీ జిమ్మిక్కులకు పడిపోతారు. రేవంత్ రెడ్డి ఆ విషయంలో దిట్ట” అని శ్రీనివాస్ రెడ్డి పోస్ట్ పెట్టారు. దీనికి తనీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.“మిస్టర్.. మీరు ఎవరైనా సరే, ‘హాస్యాస్పదం’ అనేది నిజంగా సరైన పదమే.. ఎందుకంటే తోలకంటి ప్రకాష్ గౌడ్ (5వ తరగతి), గూడెం మహిపాల్ రెడ్డి (8వ తరగతి), బండారు లక్ష్మా రెడ్డి (8వ తరగతి).. ఇలా మీ స్వంత పార్టీ (BRS) నుండి అనేక మందిని సౌకర్యవంతంగా విస్మరిస్తూ అర్హతలను అపహాస్యం చేయడం ఉత్తమమైనది. నా కెరీర్ 6 ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. బహుశా నువ్వు ‘కెరీర్’ అని ఎలా పలకాలో తెలుసుకునే వయసులో ఉన్నప్పుడే.. నేను చదువుతున్నాను, సంపాదిస్తున్నాను. నా ఎడ్యుకేషన్ మీద మాట్లాడే ముందు, మీరు మీ హోంవర్క్ చేయండి. ఇంకా ఇలా సొల్లు చెప్పి ప్రజలను మోసం చేసే టైం అయిపోయింది. సప్పుడు చేయకుండా ఒక మూలన కూర్చుంటే కొంచెం పరువైనా మిగులతది” అని తనీష్ రాసుకొచ్చాడు.తనీష్ పోస్టుపై శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించాడు. “మీరు ఆరేళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ వయసులో మీరు సరిగ్గా ఏం చేసేవారో నాకు తెలియదు కానీ, కచ్చితంగా అది సినిమాలే అయ్యి ఉంటాయి. మీరు, మీ బాస్ సినిమాల్లో కెరీర్ను నిర్మించుకుంటున్నప్పుడు.. మాలో చాలా మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, దాని భవిష్యత్తు కోసం పనిచేయడంలో నిమగ్నమై ఉన్నాము. ఎమ్మెల్యేల విద్యా అర్హతలను ప్రముఖంగా ప్రస్తావించడం సంతోషంగా ఉంది. కానీ అత్యుత్సాహంతో, పొలిటీషియన్ గా మారిన యాక్టర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అలాంటి వివరాలను ప్రస్తావించడం పూర్తిగా మర్చిపోయారు. అన్నట్టు, యాక్టర్ పవన్ కళ్యాణ్ కి నేను వీరాభిమానిని” అని ఆయన రాసుకొచ్చాడు. ఇంకా దీన్ని లాగడం ఎందుకులే అనుకున్నాడో ఏమో తనీష్ దీనికి రియాక్టర్ అవ్వకుండా.. ఈ ట్వీట్ వార్ కి ఎండ్ కార్డ్ వేశాడు.చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన అల్లాడి తనీష్.. ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పైన చెప్పుకున్న ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో పాటుగా ‘రైడ్’ అనే మరో సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సపోర్టింగ్ రోల్స్, నెగెటివ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయ్యాడు. 2018లో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 2లో పాల్గొన్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ తరుఫున యాక్టివ్గా ఉంటున్నాడు. తాజాగా తనీష్ ను జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్స్ కమిటీలో సభ్యునిగా నియమించారు.